టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో హాజరైన బహిరంగ సభకు అనూహ్యంగా జనస్పందన రావడంతో వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి రాబోతున్నామని చెబుతూ వస్తున్న తెలంగాణ బిజెపి నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో ఇంకా టీడీపీకి బలమైన మూలాలు ఉన్నాయని, దాదాపు సగం నియోజకవర్గాలలో ఆ పార్టీ చెప్పుకోదగిన శక్తిగా ఉండగలదని ఖమ్మం సభ స్పష్టం చేసింది.
అంతేకాదు, టిడిపికి తామే ప్రత్యామ్న్యాయం అని చెప్పుకొంటున్న బిజెపి సగంకు పైగా నియోజకవర్గాలలో పోటీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుండి ఫిరాయింపులను ఆకర్షించడం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంది. అందుకనే తెలంగాణాలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే టిడిపితో పొత్తు తప్పనిసరి అని పలువురు బిజెపి నాయకులు అంతర్గతంగా వాదిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉందని రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో జరిగిన 119 నియోజకవర్గాలకు చెందిన బాధ్యుల సమావేశంలో పార్టీ నాయకత్వంపై వత్తిడి వచ్చింది. తెలంగాణలోని వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందా..? అనే ప్రశ్నలు తలెత్తడంతో రెండు పార్టీలు కలసి పోటీ చేసే రాగాల రాజకీయ పరిణామాల గురించి చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి.
వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించడం కోసం జరిగిన సమావేశంలో “మాకు టిడిపితో పొత్తు లేదండి.. నమ్మండి” అంటూ ప్రజలకు అందరికి తెలిసే విధంగా తెలియ చెప్పాలని నిర్ణయించడం గమనార్హం.
ఈ విషయమై పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకోవడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘరంగా భంగపడిందని గుర్తు చేస్తూ ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే బిజెపి శ్రేణుల్లోనే అవే భయాలు ఉన్నాయని విజయశాంతి స్పష్టం చేశారు.
ఈ విషయమై స్పష్టత ఇవ్వని పక్షంలో ద్వితీయశ్రేణి నాయకులలో, పార్టీ కార్యకర్తలలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు. వెంటనే ఎంపీ డి. అర్వింద్ సైతం జోక్యం చేసుకొంటూ ఈ విషయమై సంజయ్ అసలు పార్టీ విధానం ఏమిటో వెల్లడించాలని, లేని పక్షంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. దానితో వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు ప్రసక్తి లేదని సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ విషయం ప్రజలకు చేరేవిధంగా పార్టీ శ్రేణులు అందరు విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా పిలుపిచ్చారు.