యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి రోజున ఈ విగ్రవిష్కరణకు హాజరు కావడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అంగీకారం తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో సినీయర్ ఎన్టీఆర్ విగ్రహం తయారు ఇప్పటికే పూర్తయింది.
బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని రూ.2.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సమకూర్చారు. ఖమ్మం జిల్లా తెలంగాణాలో మొదటినుండి తెలుగు దేశంకు, వామపక్షాలకు బలమైన కోటగా ఉంటూ వచ్చింది.
2018 ఎన్నికలలో సహితం ఈ జిల్లాలో టిడిపి రెండు సీట్లలో గెలుపొందింది. టిఆర్ఎస్ ఒక సీట్ కూడా గెలవలేకపోయినా టిడిపి, కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకుంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సహితం గతంలో టీడీపీ ఎంపీ కావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఇటీవలకాలంలో మొదటి బహిరంగసభను ఖమ్మంలో ఏర్పాటు చేయడంతో అనూహ్య స్పందన లభించింది.
మరోవంక ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చెయాయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఒక్క ఎమ్యెల్యే కూడా బిఆర్ఎస్ నుండి గెలవకుండా చేస్తానంటూ శపధం చేస్తున్నారు. ఇప్పుడున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహితం టిడిపి నుండి వచ్చినవారే. ఈ పరిస్థితులలో టిడిపి శ్రేణులను, ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకొని, వచ్చే ఎన్నికలలో జిల్లాలో బిఆర్ఎస్ ఉనికి చాటుకునేందుకు ఈ విగ్రవిష్కరణను ప్రధానంగా చేపట్టినట్లు తెలుస్తున్నది.
మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో బిఆర్ఎస్ నేతలే ఈ విగ్రవిష్కరణ వ్యవహారాన్ని చూస్తుండటం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇటీవల విజయవాడలో జరిపిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి కనీసం ఆహ్వానం కూడా లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ సహితం తాతగారికి నివాళులు అర్పించడం కోసం సరైన వేదికకు చూస్తున్నట్లు కనిపిస్తున్నది.