టిడిపి వైపు అడుగులేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి!

Friday, November 15, 2024

వైఎస్ కుటుంబానికి, అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొదటి నుండి సన్నిహితుడిగా పేరొందిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి క్రమంగా అధికార పక్షానికి దూరం అవుతున్నారా? మొన్నటి వరకు కత్తులు నూరిన టిడిపి వైపు అడుగులు వేస్తున్నారా? కొంతకాలంగా ఆయన వ్యవహారం గమనిస్తున్న వారికి ఇటువంటి అనుమానాలే కలుగుతున్నాయి.

తాజాగా, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తన రాజీనామా లేఖను శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి పార్టీ అధిష్ఠానానికి పంపించడం గమనిస్తే పార్టీతో అనుబంధాన్ని తెంచివేసుకొనేందుకు సిద్ధపడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఆయన రాజీనామా పార్టీలో రాజకీయ కలకలం రేపడంతో వెంటనే ఆయనను బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయిన్నట్లు తెలిసింది.

గత ఏడాది మంత్రివర్గంలో భారీ మార్పుల సమయంలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పలువురిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ తనను మాత్రం తీసివేసినప్పటి నుండి అసంతృప్తితో ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తనను తప్పించి, అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌కు మునిసిపల్‌ శాఖను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై బాలినేని బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయనను సంతృప్తి పరిచేందుకే మూడు జిల్లాల సమన్వయకర్త పదవి ఇచ్చారు. అయితే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో తనతో సంబంధం లేకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకొంటుండడంతో ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

వైఎస్ జగన్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన చెప్పిన్నట్లే సాగుతుంది. ఒంగోలు ఎంపీగా రాజకీయ ప్రవేశం చేసిన జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారనే ఆయన ఎంత వత్తిడి తెచ్చినా ఎంపీ సీట్ ఇవ్వకుండా, టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి, జిల్లా వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జగన్ చేశారు.

అటువంటిది, ఇటీవల కాలంలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుండడంతో భగ్గుమంటున్నారు. పర్చూరులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, తన బాధ్యతల్లో కొంత మేర కోత విధించి టీడీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అప్పగించడం వంటి తాజా వ్యవహారంతో అసహననాయికి గురవుతున్నట్లు తెలుస్తున్నది.  నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి చివరకి సంతమాగలూరు సీఐ బదిలీపై కూడా తన మాటకు విలువ లేకుండాపోవడాన్ని ఆయన సహించలేక పోతున్నారు.

వీటన్నింటికి మించి ఇటీవల సీఎం జగన్ మార్కాపూర్ వచ్చినప్పుడు హెలిప్యాడ్‌ వద్ద తన కారును అనుమతించక పోవడంతో ఆగ్రహంతో వెనుకకు వెళ్లిపోవడం, తిరిగి సీఎంఓ నుండి ఫోన్ రావడంతో వేదికపైకి వెళ్లినా అన్యమనస్కంగానే ఉండటం జరిగింది. ఇక నుండి ఒంగోలుకే పరిమితం అవుతానని, పార్టీ వ్యవహారాలు పట్టించుకోనని అనుచరుల వద్ద స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ఈ పరిణామాల ఫలితంగా క్రమంగా వైసీపీకి దూరంగా జరిగి, టిడిపి వైపు చూస్తున్నారని, కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే ఆయనతో మంతనాలు జరిపారని తెలుస్తున్నది. బాలినేని పార్టీ మారితే మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే వైసిపి పెద్ద కుదుపుకు గురయ్యే అవకాశం ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles