ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర సోమవారంతో ముగియనుంది. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తున్నారు. పులివెందుల నుండి ఆదేశాలు జారీ చేసి, తమ అభ్యర్థులను గెలిపించుకోగల సత్తా వైఎస్ జగన్ కు ఉంది.
దాదాపు ప్రతి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు వెనుకాడని పొగరుమోతు నాయకులు అధికార పార్టీకి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేక పోయింది. అటువంటి జిల్లాలో లోకేష్ పాదయాత్రకు అనూహ్యమైన ప్రజా స్పందన లభించింది.
రాత్రి పొద్దుపోయే వరకు కూడా వేల సంఖ్యలో ప్రజలు యాత్రలో పాల్గొంటూ ఉండడం, బహిరంగ సభలలో ప్రసంగాలను ఆసక్తిగా వింటూ ఉండటం వైసీపీ నేతలకు పెద్ద షాక్ ఇచ్చిన్నట్లయినది. ముఖ్యంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు వంటి నియోజకవర్గాలలో వేలసంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొనడం సంచలనం కలిగించింది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంతజిల్లా అయిన ఉమ్మడి చిత్తూర్ జిల్లాలో సహితం ఇటువంటి భారీ స్పందన లభించలేదు. కర్నూల్ జిల్లాలో సహితం సదా సీదాగా జరిగింది. అనంతపూర్ జిల్లాలో టిడిపికి బలమైన నియోజకవర్గాలకు ఉండడంతో సహజంగానే మంచి స్పందన లభించింది.
వైసిపి నేతలు బెదిరింపులకు పాల్పడినా, సహాయనిరాకరణకు తలపడిన లెక్కచేయకుండా పాదయాత్రకు ఏర్పాట్లు చేసిన నాయకులకే ఈ ఘనత దక్కుతుంది. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా ఉన్న పలువురు నేతలు భారీగా నిధులు కూడా వెచ్చించి పాదయాత్రకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిష్టాకరంగా తలబడినట్లు పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేశారు.
అయితే, క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో లేక మరేదైనా కావచ్చు ఇదంతా తనను చూసి జనం వస్తున్నట్లు లోకేష్ భావిస్తున్నట్టు ఆయన హావభావాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. పైగా, భారీగా సన్నాహాలు జరిపి, పెద్ద ఎత్తున జనసమీకరణకు కృషిచేసిన నాయకుల శ్రమను గుర్తించే ప్రయత్నం చేయలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక గురించి చంద్రబాబు నాయుడు సారధ్యంలో పలు బృందాలు ఒకవంక భారీ కసరత్తు చేస్తుండగా, పాదయాత్ర సందర్భంగా అక్కడక్కడా అభ్యర్థులను లోకేష్ ప్రకటించడం పార్టీ వర్గాల్లో చిచ్చు రేపుతున్న ట్లు అవుతుంది. ప్రజలతో సంబంధం లేని, సంపన్నులైన యువకులను యువతకు సీట్లు నినాదంతో అభ్యర్థులుగా అక్కడక్కడా ప్రకటించడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నది.
వైసీపీ వత్తిడులు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలను తట్టుకొని పార్టీకోసం పనిచేస్తూ, సొంతంగా డబ్బు ఖర్చు చేస్తున్న నాయకులను పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా లోకేష్ అభ్యర్థులు అంటూ కొందరి పేర్లను తెరపైకి తీసుకు రావడం ఎన్నికల్లో పార్టీకి తీవ్రమైన హాని కల్గించగలదని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.