టిడిపి ఆన్ లైన్ పత్రిక `చైతన్యరథం’లో `సాక్షి ఫోబియా’

Thursday, September 19, 2024

మంగళగిరి వద్ద గల టీడీపీ కేంద్ర కార్యాలయంలో `సాక్షి ఫోబియా’తో కొందరు నేతలు అసహనంకు గురవుతున్నారు. పార్టీ శ్రేణులలో వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ఆన్ లైన్ దినపత్రిక `చైతన్యరథం’ను ఒక వర్గం హస్తగతం చేసుకొని రాజకీయ ప్రత్యర్థులను దూషించడంలో `సాక్షి భాష’ను అనుసరించడం కలకలం రేపుతోంది.

స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద చూపి, విదేశీ కన్సల్టెంట్ సహకారంతో పత్రిక రూపురేఖలలో విశేషమైన మార్పులు తీసుకువచ్చారు. పార్టీ నేతలతో సంబంధం లేకుండా ప్రొఫెషనల్ గా దానిని నడిపేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే టిడిపిని, టీడీపీ నేతలను నిత్యం దూషిస్తూ `సాక్షి’లో వస్తున్న కథనాలకు సమాధానాలుగా, పోటీపడి దూషిస్తూ కధనాలు రావడం లేదని టీడీపీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది.

గతంలో అదే విధంగా ఆర్థిక మంత్రి బి రాజేంద్రనాథ్ రెడ్డిని దూషిస్తూ నిరాధార కథనం ప్రచురించడంతో ఇటీవల ఏపీ సిఐడి కేసు నమోదు చేసి, టిడిపి కార్యాలయంలో విచారణ జరిపింది. వాస్తవానికి ఈ ఆన్ లైన్ పత్రికను పార్టీ శ్రేణులే చదువుతూ ఉంటారని, వారిలో అత్యధికులు `సాక్షి’ని చదవరని, దానిలో ప్రచురించే `చెత్త’కు ఇక్కడ ఎందుకు సమాధానాలు ఇవ్వాలని కొందరు ప్రముఖులు అసహనం వ్యక్తం చేసినా   `సాక్షి ఫోబియా’లో చిక్కుకున్న వారికి అర్థం కాలేదు.

దానితో ఈ ఫోబియాలో చిక్కుకున్న బృందం నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గర ఫిర్యాదు చేయడం, ఆయన అనాలోచితంగా మార్పులు చేసేందుకు అవకాశం ఇవ్వడంతో,  ఇప్పటివరకు పత్రికను నిర్వహిస్తున్న సంపాదక బృందం అందుకు నిరాకరించింది. వారంతా మూకుమ్మడిగా పత్రిక నిర్వహణ నుండి నిష్క్రమించారు. ఈ విషయం తెలిసి నేరుగా చంద్రబాబు నాయుడుకు సహాయకారిగా వ్యవహరిస్తున్న, పార్టీతో సంబంధం లేని పలువురు ప్రముఖులు కలవరం చెందారు.

కేంద్రంలో గతంలో పిఐబి అధికారిగా పని చేస్తూ, ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సలహాదారునిగా పనిచేస్తున్న ఓ ప్రముఖుడు అమెరికాకు వెళ్లినప్పుడు ఇదంతా జరిగింది. ఆయన తిరిగి వచ్చే సరికి ఆన్ లైన్ పత్రికను అధ్వానంగా మార్చడం చూసి ఖంగుతిన్నారు. వైసీపీ నేతలను ఇష్టం వచ్చిన్నట్లు దూషించడం మినహా టీడీపీ శ్రేణులకు సానుకూల సందేశం ఇవ్వలేక పోతుందని గ్రహించి గగ్గోలు చెందుతున్నట్లు తెలుస్తున్నది. 

ఎంతో ప్రొఫెషనల్ గా నిర్వహిస్తున్న ఆన్ లైన్ పత్రికను సాక్షి స్థాయికి దిగజార్చడం పట్ల పార్టీలోనే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి పాత బృందాన్ని పత్రిక నిర్వహణకు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారంతా సుముఖంగా లేరని తెలుస్తోంది.  ప్రజలతో ఏమాత్రం సంబంధం లేకుండా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక పదవులలో ఉంటూ, జీతభత్యాలపై గడుపుతున్న కొందరు నాయకులతో పార్టీ ఏ విధంగా బ్రష్టు పడుతుందో ఈ ఉదంతమే వెల్లడి చేస్తుందని కొందరు పార్టీ నేతలు వాపోతున్నారు.

రాజకీయ ప్రత్యర్థులు లేవనెత్తుతున్న అంశాలకు సహేతుకమైన సమాధానాలు పార్టీ శ్రేణులు ఇచ్చే విధంగా, అధికార పక్షపు వేధింపులు, అక్రమాలు, దురాగతాలను వెల్లడి చేసే విధంగా ఆన్ లైన్ పత్రిక నిర్మాణాత్మకమైన వారధిగా ఉండగలదని భావిస్తున్న వారికి ఈ పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles