టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్న ఎమ్యెల్యే రాజాసింగ్!

Wednesday, December 18, 2024

తెలంగాణాలో అధికారంలోకి వస్తామంటూ పోటీకి అభ్యర్థుల కోసం ఇతర పార్టీల నుండి ఎవ్వరు వస్తారా అంటూ ఎదురు చూస్తున్న బిజెపి నేతలకు గత ఎన్నికలలో మొత్తం రాష్ట్రంలో గెలిచినా ఏకైక పార్టీ అభ్యర్థి, గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ ను సహితం కాపాడుకోలేని దుస్థితి తప్పదా? అనే అనుమానం కలుగుతుంది.

బీజేపీ నుంచి సస్పెండ్‌ చేసి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ ఆ పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన టీడీపీలో చేరేందుకు  సమాలోచనలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రాజాసింగ్‌ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి రాజాసింగ్ స్థానికంగా ఎంతో క్రెజ్ పెంచుకొంటున్నారనే ఈర్ష్యతో ఆయనకు సీట్ ఇవ్వరాదని రాష్త్ర బిజెపి నాయకులు, చివరకు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా స్పష్టం చేసినా ఆనాటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా సీట్ ఇచ్చారు.

సీట్ ఇచ్చినా ఆయనకు పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ పనిచేయరాదని అనధికారికంగా ఆదేశాలు జారీచేసిన, ఒక్కడుగు గెలుపొందారు. కిషన్ రెడ్డి, డా. లక్ష్మణ్ వంటి వారంతా ఓటమి చెందినా ఆయన ఒక్కరే రాష్ట్రంలో గెలుపొందారు. ఇప్పుడు బహిష్కరణ వేటును ఆసరాగా తీసుకొని, ఆయనను ఎన్నికల లోపు తిరిగి పార్టీలోకి రాకుండా మంత్రాంగం జరుపుతున్నట్లు తెలుస్తున్నది.

ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. సస్పెండై ఆరు నెలలు అవుతున్నా సస్పెన్షన్‌ ఎత్తివేతపై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీజేపీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను గ్రహించి, టిడిపికి తిరిగి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

స్వయంగా రాష్త్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నా ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటును ఎత్తివేయక పోవడం గమనార్హం. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆయన రెండు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. మరో రెండుమూడు రోజుల్లో రాజాసింగ్‌కు మార్గం సుగమం అవుతుందని, గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

టీడీపీలో చేరిన తర్వాత గోషామహల్‌ నియోజకవర్గంతోపాటు మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్‌ పార్టీ అధినేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం తేలకుండానే అక్కడి నుండి గోషామహల్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయించడానికి బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ లేదా మాజీ మంత్రి దివంగత నేత ముఖేష్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌ గౌడ్‌ పేర్లకు తెరపైకి తీసుకు వస్తున్నారు.

రాజాసింగ్‌ టీడీపీలో చేరితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో  బీజేపీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నగరంలో ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌ తదితర నియోజకవర్గల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కేవలం తనపై సస్పెన్షన్ తొలగించమని బిజెపి నాయకత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాజాసింగ్ టిడిపి బూచి చూపిస్తున్నారా? లేదా నిజంగానే చేరతారా? చూడవలసి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles