2019లో టీడీపీ అభ్యర్థిగా విశాఖ జిల్లా నుండి ఎన్నికైన్నప్పటి నుండి పార్టీకి దాదాపు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరి మంత్రి పదవి పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దానితో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడంతో తిరిగి టిడిపిలో క్రియాశీలం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ ను కలిసి, ఉత్తరాంధ్రలో ఆయన పాదయాత్రలో పాల్గొనటానని కూడా చెప్పివచ్చారు.
ఇటువంటి అవకాశవాదులు పార్టీ సీట్ ఇవ్వద్దని ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వత్తిడి వస్తున్నది. ఇటువంటి సమయంలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరాంధ్ర గ్రాడుయేట్ల నియోజకవర్గపు ఎమ్యెల్సీ ఎన్నికలు గంటాకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. టిడిపి పట్ల తన అంకితభావం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలలో క్రియాశీలంగా పనిచేసే, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంది.
ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గెలుపొందలేదు. గత ఎన్నికలలో టిడిపి బలపరచిన బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ ఒంటరిగా పోటీచేయవలసి వస్తుంది.
పైగా, అభ్యర్థి విషయంలో గందరగోళం నెలకొంది. ముందుగా బిసి మహిళ చిన్ని కుమారి లక్ష్మిని ప్రకటించి, ఆమె ముమ్మరంగా ప్రచారం చేసుకొంటున్న తరుణంలో ఆమెను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు తప్పించారు. కాపు సామాజిక వర్గంకు చెందిన డాక్టర్ వేపాడ చిరంజీవి రావును అభ్యర్థిగా ప్రకటించారు. అతని సామాజిక వర్గం కలిసి రావడంతో పాటు, రూ 4 కోట్ల మేరకు ఎన్నికల కోసం ఖర్చు పెట్టగలరని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
అయితే, ఈ ఎంపిక పట్ల ఆగ్రహంతో పార్టీ సీనియర్ నేత ఈర్లె శ్రీరామమూర్తి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో ఉన్న వైసీపీ 4 నెలల ముందే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను అభ్యర్థిని ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. ఇక్కడ రెండుసార్లు గెలుపొందిన వామపక్షాలకు సహితం కొంత పట్టు ఉంది. వారి అభ్యర్థిగా పీడీఎఫ్ తరపున డాక్టర్ రెడ్ల రమాప్రభ బరిలోకి దిగారు. వామపక్షాల తోపాటు పలు ప్రజాసంఘాలు ఆమెకు మద్దతిస్తున్నాయి.
అందుకనే, ప్రతిషకరమైన 34 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోపార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను గంటా శ్రీనివాసరావుకు అప్పగించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే, గంటాకు పెనుసవాల్ గా మారే అవకాశం ఉంది. అసలు ఈ బాధ్యత స్వీకరణకు ఆయన ముందుకు వస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.