టిడిపిలో కుల చిచ్చు రేపిన సీఐ  అంజూ యాదవ్ !

Wednesday, January 22, 2025

శ్రీకాళహస్తిలో చాలాకాలంగా టీడీపీ, జనసేన శ్రేణులపై అవమానకరంగా, దౌర్జన్యం పూర్వకంగా వ్యవహరిస్తున్న సిఐ అంజూ యాదవ్ పై స్థానిక టీడీపీ నాయకత్వం ఉద్యమించకుండా మౌనంగా ఉండటం, ఓ జనసేన నేతపై చెంపదెబ్బ కొట్టగానే స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం టీడీపీ వర్గాల్లో `కులచిచ్చు’ రేపినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లడం, అక్కడ ఆయనతో జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో ర్యాలీగా చేరడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ రావడంతో అసలేమీ జరిగిందో అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీసిన్నట్లు తెలిసింది. చాలాకాలంగా, శ్రీకాళహస్తిలో సిఐ  అంజూ యాదవ్ ఆ విధంగా వ్యవహరిస్తున్నా, అక్కడ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నించారు.

లోతుగా విచారిస్తే అక్కడి కొందరు టీడీపీ నాయకుల వత్తిడుల కారణంగా శ్రీకాళహస్తిలోని టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నట్లు వెల్లడైంది. తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నరసింహయాదవ్, పార్లమెంటు టీడీపీ ఇన్ ఛార్జ్ బీదా రవిచంద్రయాదవ్ — ఇద్దరూ సిఐ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆమెపై ఉద్యమించేందుకు వెనుకాడినట్లు వెల్లడైంది.

ఈ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ సంఘటనతో తిరుపతి ప్రాంతంలో పవన్ ఇమేజ్ బాగా పెరిగిందని, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి మౌనంగా ఉండిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. అన్యాయం జరిగినపుడు తగిన విధంగా స్పందించాలని స్పష్టం చేస్తూ నష్ట నివారణ చర్యల పట్ల దృష్టిని సారించాలని వారిని ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనకు అనూహ్యమైన స్పందన రావడం చూసి ఆ ప్రాంతంలోని టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితి కల్పించింది తమ నేతలే అన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో అంజూ యాదవ్ టిడిపి కార్యకర్తల పైన చేయి చేసుకున్న సమయంలో కూడా టిడిపి నేతలు నోరు మెదపక పోవడం గమనార్హం. 

హోటల్ యజమాని హరినాయుడు భార్య ధనలక్ష్మి పై అర్ధరాత్రి దౌర్జన్యం చేసినప్పుడు కూడా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అయితే పవన్ ఆమెపై విమర్శలు చేయడంతో ఒక్క సారిగా టిడిపి నేతలు ఉలిక్కి పడ్డారు. దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిణామంపై టీడీపీలోని బలిజ సామాజిక వర్గీయులు సహితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు కులతత్వంతో వ్యవహరించి, పరోక్షంగా అంజూ యాదవ్ దౌర్జన్యాలకు బాసటగా నిలబడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పర్యటన టీడీపీ – జనసేన శ్రేణులలో అంతరాన్ని కలిగించే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ ప్రాంతంలోని కమ్మ, యాదవ్ సామాజిక వర్గాలు టీడీపీకి మద్దతుగా ఉంటూ ఉండడంతో అంజు యాదవ్ అకృత్యాలను ప్రశ్నించడానికి వెనుకాడిన్నట్లు స్పష్టం అవుతుంది. అయితే అటువంటి వైఖరి రాజకీయంగా పార్టీకి చేటు తెచ్చే ప్రమాదం ఉండనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles