ఓ పక్క ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సర్వే నివేదికల ఆధారంగా మంత్రులు, ఎమ్యెల్యేల జాతకాలు తన చేతులలో ఉన్నాయని, ప్రతికూల నివేదికలు వస్తే ఎంత గొప్పవారైనా సీట్ ఇచ్చేది లేదని బెదిరిస్తుంటే, పార్టీలో బలమైన నేతలు ఒకరొక్కరు తమ దారి చూసుకొంటున్నారు. అటువంటి వారిలో తమ నియోజకవర్గాలపై పట్టున్న వారు, ప్రజలలో పలుకుబడి గలవారే ఉండటం గమనార్హం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలలో కాకలు తీరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పొగ పెట్టి, ఆయన నియోజకవర్గంలో మరొకరిని ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన జగన్, తాజాగా కృష్ణ జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో సహితం అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అర్ధ శతాబ్ద కాలం పాటు రాజకీయ జీవనం గల మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడైన వసంత కృష్ణ ప్రసాద్ మొదటి నుండి జగన్ కు మద్దతుదారుడిగా ఉంటూ వచ్చారు.
టిడిపిలో బలమైన నాయకుడిగా పేరొందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించి, మైలవరం నియోజకవర్గంలో అతనికి గత మూడున్నరేళ్లుగా చుక్కలు చూపిస్తున్నారు. అటువంటిది మంత్రి పదవి కూడా ఇవ్వకుండా, వచ్చే సారి సీట్ కూడా ఎగగొట్టెటట్లు వ్యవహరిస్తూ ఉండడంతో అసహనంతో బైటపడుతున్నాడు.
దేవినేని ఉమాను ఓడించినందుకు 2019లోనే మంత్రి పదవి ఆశించారు. కానీ కోడలి నానికి ఇచ్చి ఎగ్గొట్టారు. నానిని మంత్రివర్గం నుండి తొలగించడంతో మంత్రి పదవికి ఎదురు చూసిన వసంతకు తనకే కాకుండా కమ్మ సామజిక వర్గం నుండి ఎవ్వరిని తీసుకొనక పోవడంతో ఖంగు తిన్నాడు. పైగా, తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం పెరుగుతూ ఉండడం, అందుకు సీఎం జగన్ సహితం వంత పాడుతున్నట్లు ఉండడంతో ఇక వైసిపిలో తనకు చోటు లేదనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతుంది
“పది మంది రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయాను. రౌడీలను వెంటేసుకొని వారిలా తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి” అంటూ జగన్ పాలనపై బహిరంగంగా మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం జగ్గయ్యపేటలో కమ్మ వనసమారాధనలో ఎమ్మెల్యే వసంత తండ్రి మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంలో కమ్మసామాజిక వర్గానికి పదవుల్లో ప్రాధాన్యత లేదని అనటం తీవ్ర దుమారం లేపింది.
ఇటీవల గుంటూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన సమయంలో ఆ సభ నిర్వహించిన ఓ ఎన్ ఆర్ ఐ ను అరెస్ట్ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు సేవాప్రవృత్తి గల వ్యక్తి అని, తనకూ స్నేహితుడు అంటూ కితాబు కూడా ఇచచ్చాడు.
ఈ విధంగా చేస్తే ప్రవాస ఆంధ్రులు ఎవ్వరు ఏపీలో సేవా కార్యక్రమాలకు, పెట్టుబడులకు ముందుకు రారని హెచ్చరించారు. ఏదో ఓ రాజకీయ పార్టీ సభలో పాల్గొనడంతో ఆ పార్టీ వాడుగా పరిగణిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదని పరోక్షంగా సీఎం జగన్ కే హితోక్తులు పలికారు.
ఇట్లా ఉంటే, తండ్రి వసంత నాగేశ్వరరావు మంగళవారం టిడిపికి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం వైసిపిలో కలకలం రేపుతున్నది. కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు ఈ భేటీ జరిగిన్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. పైగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్నదంటూ కేశినేని నానిని ప్రశంసించారు.