టిడిపితో పొత్తు కారణంగానే కిరణ్ కాంగ్రెస్ కు దూరమయ్యారా!

Thursday, November 14, 2024

మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ లేదా మరేయితర పార్టీలోనైనా చేరవచ్చు. అయితే, ఆరు దశాబ్దాలుగా తమ కుటుంభకు కాంగ్రెస్ తో గల సంబంధాలను ఆ పార్టీ టీడీపీతో (2019లో) చేతులు కలిపిన కారణంగానే తెంచుకున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. నిజంగా రాజకీయంగా టిడిపినే అంతగా వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తుకు వెళ్లారని బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఏపీకి వచ్చిన ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాను బయటకి వచ్చేశానని వెల్లడించారు.

అయితే ఆయన మొదటగా కాంగ్రెస్ కు రాజీనామా చేసింది 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి  పదవితో పాటు చేశారు. ఆ సమయంలో రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకరం అని భావించి, కేంద్రంలోని చిదంబరం వంటి కాంగ్రెస్ మంత్రుల సలహాలు కూడా తీసుకొని చేశారు.

సమైక్యాంధ్ర పార్టీ అని స్థాపించి, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 15 నుండి 20 వరకు అసెంబ్లీ సీట్లు గెలుపొందిన తాను మరోసారి ముఖ్యమంత్రి కావచ్చని అంచనా వేస్తుకున్నారు. అయితే ఒక్క సీట్ కూడా గెలుపొందలేక పోవడం, టిడిపికి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి.

ఆ తర్వాత ఆయన సోదరుడు టిడిపిలో చేరారు. 2019 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు కూడా. ఇప్పటికీ ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీచేయబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పటి నుండి చంద్రబాబు నాయుడుతో అవగాహనతో పనిచేస్తుండేవారు.

ఇద్దరూ ఒకే జిల్లా కావడంతో, చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో మాట్లాడేందుకు గరిష్టంగా సమయం ఇస్తానని,  అందుకు ప్రతిగా ప్రతిపక్షం టిడిపిపై విమర్శలు చేయరాదని ఒక తెరచాటు అవగాహనకు వచ్చారు. ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తుండేవారు. ఆయన చంద్రబాబుకు ఎంత సమయమైనా ఇస్తుంటారని, తాము సమాధానం చెప్పబోతుంటే తమకు అవకాశం ఇవ్వడం లేదని అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుండేవారు.

ఇక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో కూడబలుక్కొని వ్యూహరచనలు చేస్తుండేవారు. డిసెంబర్, 2013లో జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఓటింగ్ కు గైహాజరు కావడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా ఆడుకుంది. పయ్యావుల కేశవ్ వంటి టీడీపీ ఎమ్యెల్యేల ఫోన్ల ద్వారా తరచుగా చంద్రబాబుతో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉండేవారు.

తన రాజకీయ అవసరాలకోసం, తన రాజకీయ మనుగడకోసం టిడిపితో, చంద్రబాబునాయుడుతో అంత సన్నిహితంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చేరిన బీజేపీ అధిష్ఠానంను మెప్పించి, వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం టీడీపీతో చేతులు కలిపిన కారణంగానే తాను కాంగ్రెస్ కు రాజీనామా చెప్పానని పేర్కొనడం అపహాస్యంగా ఉంటుంది. ఆయన కాంగ్రెస్ కు కేవలం ఒకటి, రెండు నెలల ముందే రాజీనామా చేశారు. అంటే, టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ముగిసిన సుమారు నాలుగేళ్ల తర్వాత అన్నమాట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles