అమిత్ షా, నడ్డలతో భేటీలలో పవన్ ఎంతేల్చారు!

Wednesday, January 22, 2025

ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడే మకాం వేసి వరుసగా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఉండడటం ఏపీ రాజకీయాలలో ఆసక్తి కలిగిస్తోంది. ఎన్డీయే సమావేశంలో ఏపీ రాజకీయ అంశాలను ప్రస్తావించే అవకాశం లభించక పోవడంతో బిజెపి నేతలను విడివిడిగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలని, ఈ క్రమంలో 2014 తరహాలో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుదామని మరోసారి బిజెపి పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే సమావేశం సందర్భంగానే ఈ అంశంపై మీడియా ముందు స్పష్టత ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే అందుకు బిజెపి ఏమేరకు సిద్ధంగా ఉండనే విషయమై ఢిల్లీలో ఇపుడు కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్న పవన్.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని మరోసారి బిజెపి కేంద్ర నాయకత్వంకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కాకుండా జనసేనతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి ఓట్లను చీల్చి వైసీపీని గెలిపించడం ఇష్టం లేదని స్పష్టం చేస్తున్నారు. అందుకే పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు టీడీపీతో కలిసి పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. 

బుధవారం ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ తో పవన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పొత్తులపై చర్చించినట్లు సమాచారం.  సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలోని రాజకీయ పరిస్థితులతో పాటు పొత్తుల గురించి కూడా తన అభిప్రాయాన్ని తేటతెల్లం చేసిన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను గురువారం ఉదయం కలిసి సుమారు గంటంపావు పైగా చర్చలు జరిపారు.

హోంమంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగిందని, ఈ సమావేశం ఏపీ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని కచ్చితంగా నమ్ముతున్నానని పవన్ ఓ ట్వీట్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమయంలో వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణ రాజు సహా మరికొందరు ఢిల్లీలోని ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

ఏపీలో పొత్తు పెట్టుకున్నా, పొత్తులు లేకపోయినా తమకు వచ్చే నష్టమేం లేదని భావిస్తున్న బీజేపీ ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మరోవంక వైసీపీతో తెరవెనుక స్నేహం చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు వైసీపీ బయట నుంచి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. 

బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నా  ఆ విషయంలో బీజేపీ ఇంకా స్పందించలేదు. టీడీపీతో కలిస్తే వైసీపీ దూరమవుతుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం పొత్తులపై స్పష్టత ఇవ్వడంలేదు. టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటూ రెండు పార్టీల మద్దతు పొందేందుకు బీజేపీ ఎత్తుగడ వేస్తుంది. అయితే జనసేన అధినేత పవన్ రాజకీయ మనుగడకు ఈ ఎన్నికలలో వైసీపీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయక తప్పదు. అందుకోసమే బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, అనేక కీలక బిల్లులను ఆమోదించే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీకే మద్దతిచ్చాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం నూటికి నూరు శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థులకే అనుకూలంగా పడ్డాయి. ఇలాంటి స్థితిలో తాను ఏ ఒక్క పార్టీకి దగ్గరై, మరో పార్టీని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే పాత మిత్రులను కలుపుకుంటూ ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించిన కమలనాథులు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆహ్వనం పంపలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles