టిడిపిలో క్రమశిక్షణ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి కఠినంగా వ్యవహరింపలేక పోతున్నారు. నిర్ణయాలను సాగదీస్తుండడంతో అసమ్మతి స్వైరవిహారం అవుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో గత నాలుగేళ్లుగా పార్టీ వర్గాలుగా చీలిపోయి, విజయవాడలో రచ్చ రచ్చ జరుగుతున్నా సరిదిద్దే ప్రయత్నాలు జరగడం లేదు.
2019 ఎన్నికల అనంతరం ఆయన తరచూ ధిక్కార ధోరణి ఆవలంభిస్తున్నా ఎప్పటికప్పుడు సర్ది చెప్పడం తప్ప తగు చర్య తీసుకోవడం లేదు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో వేదికలు పంచుకోవడం, పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంతో స్థానిక టీడీపీ నేతలు భగ్గుమన్న పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు.
తన నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా తానే పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అథిష్టానంపై తన అసమ్మతి గళాన్ని మరింత పెంచారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని పేర్కొన్నారు. టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని కేశినేని ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునో ధోరణిలోనే మాట్లాడారు.
చివరకు తాను పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదని, కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదని తేల్చేశారు. ప్రజలే తన బలం అని చెబుతూ ఇండిపెండెంట్ గా నిలబడినా గెలుస్తానని కేశినేని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి కూడా తనకు ఆహ్వానాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తను ముఖ్యమని పేర్కొంటూ టిడిపితో పనేమిటి అన్నట్లు స్పష్టం చేస్తున్నారు.
తనకు పార్టీతో సంబంధం లేదన్నట్లు ఒక వంక అంటూనే, మరోవంక తనను టీడీపీలో పొమ్మనలేక పొగబెట్టినట్టు వ్యవహరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం 40-50శాతం మండిస్తున్నారని, తనకు 100శాతం సెగ తగిలితే ఏమి చేయాలనేది ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూనే చిర్రెత్తితే అప్పుడు ఆలోచిస్తా అని తేల్చి చెప్పారు.
‘‘టీడీపీ మాహానాడుకు నాకు ఆహ్వానం లేదు. నేను ఒక ఎంపీని… అక్కడ రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టారు. ఎంపీగా నాకు అసలు ఆహ్వానం లేదు.. మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారు. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి నన్ను పిలవలేదు” అంటూ టిడిపితో తనకేమీ సంబంధం అన్నట్లు మాట్లాడారు.
సాక్షాత్తు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్న విజయవాడ కార్యక్రమానికే తనను పిలువలేదని,ఇది దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జీలను గొట్టంగాళ్లుగా అభివర్ణించారు.
మొన్న అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు పీఏ ఫోన్ చేసి పిలిస్తేనే తను వెళ్లానని,లోపల అమిత్ షా, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనను పిలిస్తే వెళ్లి మాట్టాడతానని అంటూ తనంతట తాను పార్టీ అధ్యక్షుడి వద్ద కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.