టిడిపికి సవాల్ గా అఖిల ప్రియ వ్యవహారం!

Wednesday, January 22, 2025

మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి భూమా అఖిలప్రియ వ్యవహారం టిడిపి నాయకత్వంకు ఇబ్బందుకు కలుగచేస్తూనే ఉంది. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర `యువగళం’ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో ఆయన సమక్షంలోనే పార్టీలో మరో ముఖ్యనేత ఏవి  సుబ్బారెడ్డిపై భౌతిక దాడి జరపడం, గాయపరచడం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు సహితం ఆగ్రహం కలిగించింది.

అయితే ఆ ప్రాంతంలోనే ఉన్న నారా లోకేష్ వారిని వారించే ప్రయత్నంగాని, జరిగిన ఘర్షణను సర్దుబాటు చేసే ప్రయత్నం గాని చేయకపోవడంతో పోలీస్ కేసు వరకు వెళ్లడం, అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్ట్ చేసి రేమండ్ కు పంపేందుకు దారితీసి పార్టీ పరువును నట్టేట ముంచినట్లయింది. లోకేష్ వారిని మందలించి, సర్దిచెప్పి ఉంటె సుబ్బారెడ్డి తనపై హత్యాయత్నం చేసారని పోలీస్ కేసు పెట్టిఉండేవారా?

నంద్యాలలో సుబ్బారెడ్డి – అఖిలప్రియ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఎప్పటికప్పుడు వారిస్తూ, సర్దుబాటు చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నప్పటికీ, లోకేష్ మద్దతు కారణంగానే అఖిల ప్రియ తనకు అడ్డులేదన్నరీతిలో వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.  అందుకనే లోకేష్ పాదయాత్ర సమయంలోనే ఆమె ఇంతటి సాహసం చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.

ఆమె తల్లిలితండ్రులు – భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిల పట్ల ఆ ప్రాంత ప్రజలలో, ముఖ్యంగా మద్దతుదారులలో, టిడిపి శ్రేణులలో ఉన్న అభిమానం కారణంగా ఆమె ఏవిధంగా వ్యవహరించినా మొదట్లో  చెల్లుబాటయింది. కానీ క్రమంగా తండ్రికి కుడిభుజంగా వ్యవహరించిన సుబ్బారెడ్డితోనే పంచాయతీ పెట్టుకోవడంతో పలువురు సన్నిహితులే దూరం అవుతున్నారు. చివరకు చెల్లెలు మౌనిక సహితం సఖ్యత కరువైన్నట్లు తెలుస్తోంది.

ఆమె నేరుగా సుబ్బారెడ్డిపై పరుషపదజాలం ఉపయోగిస్తూ, తన మద్దతుదారులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.  చిన్నప్పటి నుండి తనను పెంచిన సుబ్బారెడ్డిని కిందపడవేసి కొడుతుంటే నివారించే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. పైగా, తన చీరలాగే ప్రయత్నం చేస్తే, కోపంతో తన మద్దతుదారులు దాడికి దిగిన్నట్లు పోలీస్ స్టేషన్ వద్ద పేర్కొనడం చాలామందికి విస్మయం కలిగించింది.

ఈ సందర్భంగా అఖిలప్రియపై ఎవి సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందించిన జస్వంతి రెడ్డి అఖిలప్రియను పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని అందుకే ఈ ఘటన గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పారు.

 లోకేష్ పాదయాత్ర డిస్టర్బ్ అవుతుందనే తాము మాట్లాడలేదని తెలిపారు. తండ్రి లాంటి వ్యక్తి మీద అఖిలప్రియ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ చేసే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. యువ గళం పాదయాత్ర లైవ్ వీడియోను గనక చూస్తే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని ఆమె చెప్పారు.

ఈ సంఘటనపై విచారణకు త్రిసభ్య సంఘం నియమించినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ సభ్యుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. పైగా, ఏవి సుబ్బారెడ్డిపై పొలిసు కేసు ఉపసంహరించుకోమని వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై కొందరు జిల్లా టిడిపి నేతలు రాయబారం నడుపుతున్నారు. కానీ దాడికి కారణమైన అఖిలప్రియపై తక్షణం ఏదో ఒక చర్య తీసుకొని ఉంటె పరిస్థితి మరోవిధంగా ఉండెడిది.

పార్టీ పరువు కాపాడాలని అంటూ క్రమశిక్షణాచర్య తీసుకొనేబదులు కేసును మాఫీ చేసే ప్రయత్నం చేయడం పార్టీలో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉంది.  మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ విషయంలో తగు చర్య తీసుకోనని పక్షంలో రాష్ట్రంలో ఇతర చోట్లకూడా పార్టీలో వర్గాలు బలప్రదర్శనకు దిగేందుకు ప్రోత్సహించినట్లు కాగలదని గ్రహించాలి.

వాస్తవానికి అఖిలప్రియకూ, ఏవీ సుబ్బారెడ్డికీ మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ఆమె అనుమానిస్తున్నారు. వాటి వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కాస్తా దాడుల వరకూ వెళ్లింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles