ఢిల్లీ వెళ్లి మిత్రపక్షం బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసి వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరిలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు (గత మూడు వారాలుగా) ఆ మాట అనడం లేదు. పరోక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ ల మధ్య ఎన్నికల పొత్తు కోసం ప్రయత్నిస్తానని చెప్పిన మాటలను ఇప్పుడు ప్రస్తావించడం లేదు.
మరోవంక, కనీసం మిత్రపక్షం బిజెపితో కలిసి రాజకీయంగా ముందడుగు వేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎక్కువగా మీడియా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఈ విషయమై బిజెపి, టిడిపి నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా జనసేన నేతలు ఎవ్వరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.
ఏపీలో జనసేన టీడీపీతోనే ఉందని, బీజేపీ నాయకులు వైసీపీకి తాబేదారుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యలు చేయడంపై కొందరు బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే, జనసేన నేతలెవ్వరూ నోరు మెదపలేదు. రాజకీయాల్లో బీజేపీ తప్పుడు పద్దతులు అవలంబిస్తోందని ఆరోపించారు.
తమ కూటమి (జనసేన – బీజేపీ)లో చిచ్చు పెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుందని అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని, జనసేనతో కలిసి వెళ్లాలనేది పార్టీ నేతల అభిప్రాయం కూడా అని జీవీఎల్ చెప్పారు.
ఇవ్వన్నీ చూస్తుంటే టిడిపి, జనసేన కలిస్తే వైసిపి తిరిగి అధికారంలోకి రావడం అసంభవం కావడంతో, వైఎస్ జగన్ ను ఆదుకొనేందుకు ఎట్టి పరిస్థితులలో టిడిపితో పవన్ కళ్యాణ్ చేతులు కలపకుండా బిజెపి కేంద్ర నాయకులు తమ వద్ద ఉన్న `అస్త్రాలు’ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది.
కొద్దికాలం క్రితం చెన్నైలో ఆదాయపన్ను అధికారులు చిరంజీవి వియ్యంకుడుపై దాడులు జరిపి, భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసులో అవసరం అనుకొంటే చిరంజీవిని కూడా ఇరికించగలమనే సంకేతం ఇచ్చారని అనధికార కధనాలు వెలువడుతున్నాయి. అదే విధంగా, పవన్ కళ్యాణ్ తో గతంలో ఒక సినిమాలో నటించిన ఒక నటి ఆరోపణలకు సంబంధించిన పెన్ డ్రైవ్ సహితం అందుబాటులో ఉందని చెబుతున్నారు.
అందుకనే, నేరుగా టిడిపితో పొత్తు లేదని కాకుండా వారి ఇవ్వలేని సీట్లను జనసేన అనధికారికంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తున్నది. కనీసం 40 సీట్లు అడుగుతున్నారని, 25 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని తెలిసింది. సిట్టింగ్ ఎమ్యెల్యేలు అందరికి తిరిగి సీట్ ఇస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారు. కానీ, కొన్ని టీడీపీ ఎమ్యెల్యేల సీట్లు, ప్రముఖ టిడిపి నాయకులు పోటీ చేసే సీట్లు జనసేన కోరుతున్నట్లు చెబుతున్నారు.
జనసేన కోరుతున్న సీట్లలో ఆ పార్టీకి బలమైన అభ్యర్థి అంటూ ఎవ్వరూ లేరని, సీట్ ఇస్తామంటే ఎవ్వరో ఎన్ఆర్ఐ లేదా సంపన్నుడు వచ్చి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పొంతనలేని మాటలు చెబుతున్నారు. ఈ విధంగా ఆషామాషీగా అభ్యర్థుల ఎంపిక జరిగితే ఓడిపోవడం జరుగుతోందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.