ఎంసెట్ పరీక్ష లాంటిది రాస్తున్నప్పుడు ఎంత కష్టపడి చదివినా సరే టార్గెట్ చేసిన ర్యాంకు కొట్టడం మిస్ అయిన విద్యార్థి.. ఒకసారి లాంగ్ టర్మ్ వెళ్లి మళ్లీ ప్రయత్నించాలి అనుకుంటాడు. ఏడాది పాటు వేరే ధ్యాస ఏమీ లేకుండా కూర్చుని చదువుతూ మళ్లీ అటెంప్ట్ చేస్తాడు. సహజంగా ఫలితం దైవాధీనంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అదే మాదిరి వాతావరణం కనిపిస్తోంది. గత ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగి మూడో స్థానంతో సరిపెట్టుకున్న సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ ఇప్పుడు అక్కడ మళ్ళీ పోటీ చేస్తానని చెబుతున్నారు. 2019లో ఆయన జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అదే నియోజకవర్గ పరిధిలో నుంచి పవన్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం.. పవన్ ను ఆదరించిన కులబలం.. ఇవన్నీ అడ్వాంటేజీలుగా కలిసివస్తేనే ఆయనకు 2.88 లక్షల ఓట్లు వచ్చాయి. ఇది చెప్పుకోదగ్గ ఓట్లే కానీ.. తెలుగుదేశాన్ని ఓడించడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడ్డాయి. అక్కడ తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కేవలం 4200 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే తనకు దక్కిన ఓట్లు అన్నీ పూర్తిగా తన బలమే అని జేడీ లక్ష్మీనారాయణ అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ మళ్లీ అదే విశాఖపట్నంలో పోటీ చేస్తానని అంటున్నారు. పార్టీల టికెట్ దక్కకపోతే గనుక ఇండిపెండెంటుగా అయినా సరే బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు.
నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న ఈ ఐపీఎస్ అధికారికి ఆమాత్రం కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. కానీ, ముందే చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ కోచింగ్ తర్వాత మళ్లీ అటెంప్ట్ చేసే విద్యార్థి ఆ ఏడాది పాటు వేరే ధ్యాస లేకుండా చదువు మీదనే ఫోకస్ పెట్టాలి. రాజకీయాల్లో అయినా అంతే. జేడీ లక్ష్మీనారాయణ అంత శ్రద్ధగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం మీద ఈ ఐదేళ్లు శ్రద్ధ పెడుతూ వచ్చారా అనేది ప్రశ్న. గతంలో పోటీ చేసిన జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చి, సొంత పార్టీని ప్రకటించి, దానిని కూడా గాలికి వదిలేసి.. రకరకాల కుప్పిగంతులతో ఆయన రాజకీయ ప్రస్థానం సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇండిపెండెంటుగా పోటీ చేసి అయినా సరే నెగ్గగలను అనే కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం చిత్రమే. ఎన్నికలవేళ వరకు ఆయనలో ఈ కాన్ఫిడెన్స్ ఉంటుందా? సన్నగిల్లి పోతుందా! ఈలోగా ఆలోచనలు ఏమైనా మారుతాయా? అనేది వేచి చూడాలి.