జూన్ 2న కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి!

Wednesday, December 18, 2024

బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయినప్పటి నుండి మరో పార్టీలో చేరడమా లేదా సొంతంగా మరో ప్రాంతీయ పార్టీని ప్రారంభించడమా అని ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్న  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

మొదట్లో వైఎస్సాఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు వారిద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీకి చెందిన ఓ బృందం ప్రత్యేకంగా పొంగులేటితో భేటీ జరిపి సుదీర్ఘంగా చర్చించారు కూడా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో రెండు మినహా మిగిలిన ఎనిమిది సీట్లు పొంగులేటి సూచించిన అభ్యర్థులకు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది.

కాంగ్రెస్ పావులు కదపడంతో బీజేపీ చేరికల కమిటీ కూడా రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం పొంగులేటి, జూపల్లిలతో ఇటీవల ఖమ్మంలో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది సీట్లు పొంగులేటికే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అధిష్ఠానం నుంచి స్పష్టత రాకపోయేసరికి ఇద్దరు నేతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

ఏ పార్టీలో చేరినా తాము చెప్పిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని ఆ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ అవతరణ రోజైన జూన్ 2న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే, సేవ్ వ‌న‌ప‌ర్తి పేరుతో వనపర్తిలో ఆదివారం జరిపిన ఆత్మ‌గౌర‌వ స‌భ‌లోనే ఈ విషయమై వారిద్దరూ ఒక ప్రకటన చేయగలరని అందరూ భావించారు. కానీ, వారు తేల్చకపోవడంతో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయారని అభిప్రాయం కొన్ని వర్గాల్లో వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ లో ఇప్పటికే తెలంగాణాలో లెక్కకు మించి నాయకులు ఉన్నారు. వారి మధ్యలో తాము ఇమడగలమా? అనే అనుమానం వారిని వెంటాడుతున్నట్లున్నది.

కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెంచింది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఫలితాలు చూపించి చేరికలు పెంచాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎటూ తేల్చుకోలేకపోతున్న పొంగులేటి, జూపల్లిలను ఇదే అదనుగా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక ఎన్నికల్లో విజయంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.  తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండడంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. అయితే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద బలం చేకూరినట్లే కాగలదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles