జీవో 111 భవిష్యత్ పై నోరుమెదపని కాంగ్రెస్, బీజేపీ

Monday, December 23, 2024

జీవో నం 111 ఎత్తివేతకు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదముద్ర వేయగానే ప్రతిపక్షాలు గగ్గోలు మంటున్నాయి. ఈ జిఓ కారణంగా కారుచౌకగా కేసీఆర్ కుటుంభం, వారి సన్నిధులు పెద్ద ఎత్తున భూములను కొట్టేసి, ఇప్పుడు ఆ భూములను భారీ మొత్తాలకు అమ్ముకోవడానికి పన్నిన కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో లక్షల కోట్ల రూపాయాలు లబ్ది పొందుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

వాస్తవానికి,  ఈ అంశంపై గతంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే సర్కార్ కూడా ముందుకెళ్తోంది. తాజాగా 111 జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో 84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటాయి. తమ ప్రాంతం ఇక అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి.

జీవో 111 ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో కొనుగోలు చేసిన భూముల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎన్జీటీని కూడా ఆశ్రయిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, ముందు భూములు కొనుగోలు చేశాక జీవో 111 ఎత్తివేశారని రేవంత్ ఆరోపించారు.  బీజేపీ నేతలు కూడా రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని, ఎన్నికలకు నిధులు సమీకరించుకోవడం కోసమే కేసీఆర్ 111 జీవో ఎత్తివేయడానికి సిద్ధమయ్యారని అంటోంది. 111 జీవో రద్దుతో  హైదరాబాద్ కు ముప్పు వాటిల్లిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీలు ఎంత ఘాటుగా స్పందిస్తున్నప్పటికీ, కీలకమైన ఓ జిఓ భవిష్యత్ గురించి మాత్రం నోరుమెదపడం లేదు. మరి కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి తాము అధికారంలోకి రావాలని ఒక వంక కాంగ్రెస్, మరోవంక బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ఒకవేళ తాము అధికారంలోకి వస్తే ఆ జిఓను తిరిగి తీసుకు వస్తామని ఈ రెండు పార్టీల నాయకులు చెప్పకపోవడం గమనార్హం.  ఆ విధంగా చెబితే పలు నియోజకవర్గాల్లో స్థానికుల నుండి వచ్చే ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని కాంగ్రెస్, బిజెపి భయపడటమే అందుకు కారణంగా పలువురు భావిస్తున్నారు. పైగా, ఈ జిఓ కారణంగా భారీగా లబ్ధిపొందే  స్థిరాస్తి వ్యాపారులతో కొందరు ఈ రెండు పార్టీలలో కూడా ఉన్నారు.

ఈ పరిధిలోకి వచ్చే భూములు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. తాజా నిర్ణయంతో అక్కడి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ప్రాంతానికి మహర్దశ వచ్చిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రకటనలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles