చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనంలో తిరుగుతూ, భారీ బహిరంగ సభలలో ప్రసంగిస్తుంటే తన ప్రభుత్వంకు కాలం మూడిందనే భయంతో, వారిని కట్టడి చేయడం కోసం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం 1 ఇప్పుడు అశనిపాతంగా తయారైంది.
ఈ జీఓ రాగానే కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు సభలకు అడుగడుగునా పోలీసులు అడ్డుపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పైగా, ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడటానికి ఓ ప్రధాన అస్త్రంగా మారింది. టిడిపి, జనసేన, వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా కలిసి ఉమ్మడిగా పోరాట కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటి వరకు టిడిపి, జనసేనలకు దూరంగా ఉంటూ వస్తున్న పలు పౌరసమాజ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు సహితం ఇప్పుడు ఉమ్మడిగా ప్రభుత్వ దమననీతిపై పోరాటానికి సిద్దమవుతు ఉండడం జగన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది.
ఈ చీకటి జీఓకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. దానితో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టం అవుతుంది. అసలు ప్రతిపక్షాల సభలపై ఎక్కడ ఆంక్షలు పెట్టమంటూ మంత్రులే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా, 1861 పోలీస్‌యాక్ట్‌కు లోబడే జీవో నెం.1 తెచ్చామని పేర్కొంటూ రోడ్‌షోలు, పాదయాత్రలు ఆపేందుకే జీవో 1 తెచ్చామన్నది అవాస్తవమని
శాంతి భద్రతల డీజీ డా. రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం విధించలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే, కొన్ని కీలక ప్రాంతాల్లోనే వీటిని నియంత్రించాలని చెప్పామని పేర్కొన్నారు.
అలాగే హైవేలపై బహిరంగ సభలు పెట్టకూడదని చెప్పామని ఆంటోనీ, అయినప్పటికీ షరతులతో సభలు, సమావేశాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. పబ్లిక్ రోడ్స్‌కు దూరంగా పోలీసుల సూచనతో మీటింగ్స్ పెట్టుకోవచని అంటూ రీకాకుళంలో జనసేన మీటింగ్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు.
రహదారులలో సహితం సభలకు నిషేధం పెద్దగా వర్తింపదని అంటూ పేర్కొంటూ రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని వెల్లడించారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు.
అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ వివరణతో ప్రతిపక్షాల విమర్శలను ఏ మేరకు కట్టడి చేయగలరో చూడవలసి ఉంది.
అయితే, ఇప్పటి వరకు హోమ్ మంత్రి గాని, డిజిపి గాని ఈ `చీకటి జీవో’ గురించి మాట్లాడక పోవడం గమనార్హం. ప్రతి రోజూ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇస్తుంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఇప్పుడు డా. రవిశంకర్ అయ్యన్నార్ ను రంగంలోకి దింపినట్లు స్పష్టం అవుతుంది.