జాతీయ రాజకీయాలలో చంద్రబాబు, కేసీఆర్ ఒంటరి!

Friday, November 22, 2024

2024 ఎన్నికలకు సన్నద్ధంగా మంగళవారం జాతీయ స్థాయిలో రెండు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్లాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం గత నెల 23న పాట్నాలో సమావేశమైన ప్రతిపక్షాలు మరింత విస్తృతంగా బెంగుళూరులో భేటీ జరుపుతున్నాయి. ఈ భేటీలో 26 పక్షాలు పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

మరోవంక, దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే భేటీ జరుగుతుంది. ఇందులో 36 పక్షాల నేతలు పాల్గొంటున్నరని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. ఒక విధంగా జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలు రెండు ప్రధాన కూటములుగా చీలిపోతున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో కీలకమైన పార్టీలుగా ఉంటున్న టిడిపి, బిఆర్ఎస్ లకు ఈ రెండు భేటీలలో ఆహ్వానం అందకపోవడం గమనార్హం.

గతంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రెండు కూటములకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంతకాలంగా బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ వైసీపీతో అంటకాగుతూ ఉండడంతో దూరంగా ఉండక తప్పడం లేదు.

మరోవంక, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కొంతకాలంగా కలలు కంటున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహితం ఈ రెండు భేటీలకు దూరంగా ఉంటున్నారు. కొద్దీ రోజుల క్రితం సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చి, కేసీఆర్ ను కలిసి ప్రతిపక్ష కూటమిలో కలసి రావాలని ఆహ్వానించారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కావడంతో ఆ కూటమిలో చేరలేని పరిస్థితి ఏర్పడింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎన్డీయే సమావేశంకు ఆహ్వానం వచ్చింది. ఆయన కొంతకాలంగా బిజెపి మిత్రపక్షంగా ఉంటూ ఉండడంతో ఆ ఆహ్వానం రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందకపోయినప్పటికీ బిజెపికి `నమ్మకమైన మిత్రుడు’గా వ్యవహరిస్తున్నారు. బిజెపి సహితం ఆయనకు కొండంత అండగా ఉంటూ వస్తోంది.

ఎన్డీఏ, యూపీఏలు రెండు తమ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులకు సిద్దమవుతున్న వేళ తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తావన ఎక్కడ వినిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ హడావుడి చేసిన ఆ పార్టీ ఏ కూటమిలో కనిపించడం లేదు. 

తానే సొంతంగా ఓ కూటమిని సృష్టిద్దామనుకున్నకేసీఆర్ కలలు నెరవేరేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌తో చేతులు కలిపిన నేతలెవరు ఆ దరిదాపుల్లో కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యమ్యాయ వేదికను నిర్మించాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు.

మరోవంక, దేశంలో సంకీర్ణ రాజకీయాల్లో స్థిరత్వం తన వల్లే సాధ్యమైందని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఏ కూటమి నుంచి ఆహ్వానం లేకుండా పోయింది. అటు ఎన్డీఏ, ఇటు కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటమిలో బాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. చంద్రబాబు బీజేపీ కూటమి వైపు చూస్తున్నా ఆ పార్టీ నుంచి స్నేహ హస్తం మాత్రం దక్కలేదు. అదే సమయంలో కనీస ప్రాతినిధ్యం లేని జనసేనకు మాత్రం బీజేపీ నుంచి పిలుపు దక్కింది.

మరోవైపు ఎన్డీఏ కూటమి సమావేశానికి చిన్నాచితక పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా టీడీపీకి దక్కలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కూటమికి చంద్రబాబు దూరమైపోయారు. దీంతో వాళ్లు కూడా బాబును లెక్కలో తీసుకోలేదు. ఏదేమైనా ఒకప్పుడు  టిడిపిలో సన్నిహితులుగా వ్యవహరించిన చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. వారిద్దరూ జాతీయ రాజకీయాలలో ఒంటరిగా మారిన్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles