ఒక వంక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు, మరోవంక అక్రమార్జన కేసులలో సిబిఐ దూకుడు పెరుగుతూ ఉండడంతో 2024 ఎన్నికల ముందుగాని, ఆ తర్వాత గాని సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం తధ్యం అనే అభిప్రాయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తం అవుతున్నది. అటువంటప్పుడు పార్టీ సారధ్యం, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి కోసం సీఎం సతీమణి వైఎస్ భారతిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఆమె తెరవెనుక ప్రభుత్వ వ్యవహారాలలో కీలక పాత్ర వహిస్తున్నారు. పలువురు కీలక నాయకులతో సహా ముఖ్యమైన అంశాలపై `ఓ సారి భారతితో మాట్లాడు’ అంటూ స్వయంగా సీఎం జగన్ సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. సీఎం కార్యాలయంలో సహితం భారతికి నమ్మకమైన వారే అధికారులుగా, అనధికారులుగా మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
అయితే, ముఖ్యమంత్రి పదవి, పార్టీ సారధ్యం వహించడంకోసం జనంలోకి రావలసి ఉంది. అందుకోసం వచ్చే ఎన్నికలలో జమ్ములమడక నుండి అసెంబ్లీకి ఆమెతో పోటీ చేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ తర్వాత కీలకమైన అధికార కేంద్రంగా ఆమెను ప్రాజెక్ట్ చేయడంతో పాటు, తమ కుటుంబానికి బలమైన జమ్ములమడుగులో వర్గపోరును కట్టడి చేయడం కోసం కూడా ఆమె పోటీచేయడం అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అక్కడ ప్రస్తుత ఎమ్యెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. టిడిపి నుండి వచ్చి చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్యెల్సీ సీట్ ఇచ్చి సంతృప్తి పరచాలని చూస్తున్నా, ప్రస్తుత ఎమ్యెల్యేకు తిరిగి సీట్ ఇస్తే సహకరించే ప్రసక్తి ఉండదు. పైగా, గత వారం జగన్ శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అందుచేత ఈ ప్రాంతం జగన్ కుటుంబంకు రాజకీయంగా కీలకమైనది.
స్వయంగా వైఎస్ భారతి పోటీచేస్తే పార్టీలో అందరూ కలసి ఉండే అవకాశం ఉండటమే కాకుండా, స్టీల్ ప్లాంట్ పై తమ కుటుంబం ఆధిపత్యం కూడా కొనసాగే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లోగా జగన్ జైలుకు వెళ్ళవలసి వస్తే, భారతిని సీఎంగా చేయాలని ఎట్లాగూ నిర్ణయించారు. ఆమె ఎన్నికల ముందే సీఎం పదవి చేపట్టవలసి వస్తే ఎట్లాగూ ఎన్నికలలో పోటీ చేయక తప్పదు. అందుకనే ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో మరోసారి అధికారంలోకి రాగలమని జగన్ ధీమాగా ఉన్నప్పటికీ, తన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిలో తాజాగా వ్యక్తమవుతున్న మార్పు ఆందోళనకు గురిచేస్తున్నది. ఇన్నాళ్లు కోర్టు కేసులు వేగంగా ముందుకు వెళ్లకుండా, జైలుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గడిపినా, రాబోయే రోజులలో సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయంతోనే ఎటువంటి పరిస్థితులకైనా సిద్దపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.