జనసేన తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల ప్రకటనపై దుమారం

Monday, January 20, 2025

ఇప్పటి వరకు ఎన్నికల పొత్తుపై, అభ్యర్థుల ఎంపికపై పెదవి విప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెనాలి అభ్యర్థిని ప్రకటించడం వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు తాను పోటీ చేసే నియోజకవర్గం గురించే పవన్ తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేయాలని చెబుతున్నా పొత్తుల గురించి సమయం వచ్చినప్పుడు చూద్దాం అంటున్నారు.

కానీ పార్టీలో నం 2 గా పరిగణిస్తున్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి పోటీచేస్తారని తెనాలిలో నిర్వహించిన నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ పొత్తులలో దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇక్కడి నుండే 2004, 2009లలో కాంగ్రెస్ అభ్యర్థిగా  మనోహర్ గెలుపొందారు. కానీ ఆ తర్వాత వరుసగా 2014, 2019 ఎన్నికలలో ఓటమి చెందుతూ వచ్చారు. 

2014లో ఇక్కడి నుండి గెలుపొందిన టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తిరిగి పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. నియోజకవర్గంలో నాదెండ్ల, ఆలపాటిలలో ప్రస్తుతం ఆలపాటికే ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. అటువంటి సందర్భంగా టిడిపితో ఎన్నికల పొత్తు అంటూ కుదిరితే ఇక్కడి నుండి ఏ పార్టీ అభ్యర్థి పోటీచేయాలో అన్న విషయం సంకటంగా మారే అవకాశం ఉంది.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వ్యూహాత్మకంగా టీడీపీని మానసికంగా సిద్ధం చేసేందుకు వేసిన అడుగా? లేదా  స్థానికంగా పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచేందుకు అటువంటి ప్రకటన చేశారా? తెలవలసి ఉంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని పవన్ మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్‌ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

షూటింగ్‌లు ఉంటేనే పవన్‌ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినిమాలపై చర్చలకు దర్శకులు కూడా మంగళగిరికే రానున్నారు. అందుకు ఆయనకు చేదోడుగా మనోహర్ పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. మనోహర్ మద్దతు కోసమే ఆయన సీటు విషయంలో స్పష్టత ఇచ్చేందుకు పవన్ ఈ ప్రకటన చేశారని జనసైనికులు భావిస్తున్నారు. టిడిపితో పొత్తు ఏర్పర్చుకున్నా  తెనాలి సీటు విషయంలో రాజీలేదని సంకేతం కూడా తద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని, అక్కడ సీటూ, గెలుపూ మనదే అని పవన్ కళ్యాణ్ భరోసా కూడా వ్యక్తం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం తేల్చి చెప్పడం గమనార్హం. ఈ విషయమై టిడిపి శ్రేణులు ఏవిధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles