జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్?

Sunday, December 22, 2024

వైసీపీ ఆరంభం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటున్న మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గానికి తలెత్తిన విభేదాలే అందుకు కారణం అని స్పష్టం అవుతుంది. 
తన వర్గం నాయకుల్ని మంత్రి చెల్లుబోయిన వేధింపులకు గురి చేస్తున్నారని పిల్లి ఆగ్రహంగా ఉన్నారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. తనకు టిక్కెట్ దక్కకపోతే కుమారుడికి అవకాశం కల్పించాలని పార్టీకి విజ్ఞప్తి చేశారు. 

అయితే, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మరో మారు అవకాశం ఉంటుందనే సంకేతాలు పార్టీ నుంచి రావడంతో తన దారి తాను చూసుకోవాలని పిల్లి సుభాష్‌ చంద్రబోస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి వేణుగోపాల్ కు తిరిగి సీట్ ఇస్తే తాను గాని లేదా తన కుమారుడు గాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తామని గత ఆదివారం పిల్లి బహిరంగంగానే వెల్లడించారు.

కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా  పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను తాడేపల్లి పిలిపించి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అక్కడ నుండి పోటీచేయాలనుకొంటున్నట్లు  ముందులా తనకు ఎందుకు చెప్పలేదని, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇప్పుడు పేచీలు పెట్టడం ఏమిటంటూ సీఎం జగన్ నిలదీసినట్టు తెలుస్తున్నది.

తాజాగా తాడేపల్లి నుండి మరోసారి పిలుపు రావడంతో ఎంపీ బోస్, ఆయన తనయుడు అక్కడకు చేరుకున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అవుతారని భావించారు. కానీ చివరి నిమిషంలో తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ మిథున్‌రెడ్డితో తండ్రీకొడుకులిద్దరూ సమావేశం అయ్యారు. ఈ భేటీలో  సీనియర్ నేతగా ఉంది అధిష్ఠానాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడటం పట్ల మిథున్‌రెడ్ బోస్ అసహనం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. 

 సీనియర్ లీడర్ అధిష్టానాన్ని ధిక్కరించేలా వ్యవహారించొద్దంటూ సూచించినట్లు సమాచారం. కానీ బోస్ మాత్రం రామచంద్రపురం టికెట్ ఇస్తే మంత్రికి ఇస్తే పార్టీ వీడడం తప్పదని తేల్చి చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత పెద్ద వారు చెప్పినా వినబోనని పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి బోస్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. 

మంత్రి వేణుతో సిట్టింగ్ ఏర్పాటు చేస్తానని మిథున్‌రెడ్డి అనగానే అలా కుదరదని బోస్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని అంటున్నారు. ఇందుకోసం మిథున్‌రెడ్డి ఎంత బుజ్జగించినా బోస్ ససేమిరా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వేణు కింద పని చేసే వాళ్లు ఎవరూ లేరంటూ మిథున్‌రెడ్డి ముందు బోస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సుభాష్‌ చంద్రబోస్‌ కుమారుడు సూర్యప్రకాష్‌ రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి నుంచి భరోసా ఇచ్చినా  సుభాష్‌ చంద్రబోస్‌ తన ధోరణి మార్చుకొనేటట్లు కనిపించలేదు.  రామచంద్రాపురం నియోజక వర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు సొంత వర్గం ఉండటంతో అక్కడి నుంచి తన కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నారు.

రామచంద్రాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తొలిసారి 1989లో గెలుపొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఆ తర్వాత 2004, 2009లో గెలుపొందారు. 2009లో వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవిని వదులుకుని జగన్ వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పిల్లి ఓటమి పాలయ్యారు. 

2014లో రామచంద్రాపురం నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 2019లో మండపేట నుంచి పోటీ చేశారు. వరుసగా మూడు సార్లు ఓటమి పాలైనా కష్టకాలంలో తన వెన్నంటి ఉన్నందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత ఏడాది మండలిని రద్దు చేయాలని భావించడంతో మోపిదేవితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపించారు.

తాజా పరిణామాలతో అధిష్టానంపై అలక వహించిన పిల్లి పార్టీని విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కూడా ఎంపీ మిథున్‌ రెడ్డి చర్చలు జరిపారు. తోట త్రిమూర్తులు సైతం మంత్రి వేణుగోపాలకృష్ణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles