ఎన్నికల్లో గెలుపోటములను లెక్క చేయకుండా పదేళ్లుగా పార్టీ మనుగడ సాగింపగలిగేటట్లు చేయడమే రాజకీయాలలో తాను సాధించిన గొప్ప విజయంగా ప్రచారం చేసుకొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఒంటరిగా మిగిలిపోతున్నట్లు స్పష్టం అవుతున్నది. పార్టీ నిర్మాణం పట్ల శ్రద్ద చూపకపోవడం, పార్టీలో వివిధ స్థాయిలలో నాయకత్వం ఎదిగే విధంగా చూడకపోవడంతో ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టం అవుతుంది.
2019 ఎన్నికలలో సహితం పవన్ కళ్యాణ్ సభలకు తడోపతండాలుగా జనం వచ్చినా ఓట్లు మాత్రం రాకపోవడం గమనార్హం. తాజాగా ప్రారంభించిన `వారాహి విజయ యాత్ర’కు జనం స్పందన ఘనంగా అంటున్నప్పటికీ, అధికార పక్షం నుండి ఎదురవుతున్న ముప్పేట దాడులకు జనసేన ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడులకు మంత్రులు, వైసీపీ నేతలు నలువైపులా నుండి దిగుతున్నారు.
అయితే, వారి దాడులను తిప్పికొట్టే యంత్రాంగం జనసేనలో కనిపించడం లేదు. అప్పుడప్పుడు తనపై చేస్తున్న విమర్శలకు తానే జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఏర్పడుతున్నది. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకోదగిన నేతలు అంటే నాదెండ్ల మనోహర్, సోదరుడు నాగబాబు. వారి ఇదివరలో ధీటుగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, వారి మాటలు ప్రజలలోకి అంత సూటిగా వెళ్లడం లేదు. దానితో వారు సహితం ఇప్పుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ సహితం తనపై జరుగుతున్న దాడులకు సూటిగా సమాధానాలు ఇవ్వలేక పోతున్నారు. తనపై హత్యా ప్రయత్నం జరగవచ్చని చెప్పడం, కొన్ని సినిమా డైలాగ్ లు మాదిరిగా అధికార పక్షం నేతలను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థుల గురించి మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇవ్వలేక పోతున్నారు.
పార్టీలో తాను తప్ప మరెవ్వరు నాయకుడిగా ఎదిగే అవకాశం ఇవ్వకపోవడంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరి పోరు జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నాయకునిగా ఎదగనిస్తే వారు అవినీతికి పాల్పడతారని, అప్పుడు తనకు చెడ్డ పేరు వస్తుందనే భయంతో నాయకత్వ లక్షణాలు ఉన్న అనేకమందిని ప్రోత్సహించలేదని తెలుస్తున్నది.
అందుకనే పార్టీలో చాలామంది నాయకులు ఉన్నప్పటికీ వారు `మండల స్థాయికి ఎక్కువ, నియోజక స్థాయికి తక్కువ’ అన్నట్లుగా సొంత పార్టీవారే ఎద్దేవా చేస్తున్నారు. అందుకనే ప్రజల దృష్టిని కాకపోయినా, కనీసం పార్టీ మద్దతుదారుల దృష్టిని ఆకట్టుకో కలిగిన నాయకులు అంటూ ఎవ్వరూ ఇప్పుడు పార్టీలో కనబడటం లేదు. ఇటువంటి దుస్థితి ఎన్నికల సమయంలో పార్టీకి పెను ముప్పు కలిగిస్తుంది.
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల రంగంలో పోరాడాలి అంటే వివిధ స్థాయిలలో నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని ప్రోత్సహిస్తుండాలి. అటువంటి ప్రయత్నం జరగని పక్షంలో పార్టీ అభిమానులు ఎంతగా ఉన్నప్పటికీ అవి ఓట్లుగా మారడం సాధ్యం కాదు. అందుకనే 2019 ఎన్నికలలో జనసేన బొక్కబార్ల పడినట్లు చెప్పుకోవచ్చు.
ఆ తర్వాతనైనా, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పట్ల అంతగా దృష్టి సారింపలేదు. మొదట్లో నాగబాబు కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత వివిధ కారణాలచేత ఆయన కూడా అంతగా దృష్టి సారించినట్లు కనబడటం లేదు. ఒక వంక పవన్ కళ్యాణ్ `వారాహి విజయ యాత్ర’ ద్వారా ప్రజలలోకి చొచ్చుకు వెడుతూ, ఎన్నికలలో మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ, మరోవంక మరో బృందం పార్టీ సంస్థాగత స్వరూపాన్ని పటిష్టం చేయడం పట్ల దృష్టి సారించాలి.
పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ, చెప్పులు కూడా చూపిస్తూ మంత్రులు, ఎమ్యెల్యేలు నలువైపులా నుండి దాడి చేస్తుంటే, అటువంటి దాడులను తిప్పికొట్టగల సామర్ధ్యం గల నేతలు జనసేనలో కనబడక పోవడం ఎంతో నష్టం కలిగిస్తున్నది.