జనసేనలో చేరేందుకు కన్నా సిద్ధం!

Wednesday, January 22, 2025

ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఒకటి, రెండు వారాలలో  బీజేపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో తలెత్తిన విభేదాలు ఇప్పట్లో సర్దుకునే పరిస్థితులు లేకపోవడంతో పాటు, పార్టీ జాతీయ నాయకత్వం సహితం పట్టించుకొనక పోవడంతో కన్నా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం భీమవరంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. దీనిపై జాతీయ నేతలు ఆరా తీశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎవరున్నా తన మంత్రి పదవికి మాత్రం ఢోకా లేని విధంగా అధికారం చెలాయించిన కన్నా కాంగ్రెస్ ప్రభుత్వపు చివరి రోజులలో ముఖ్యమంత్రి పదవికి కూడా ప్రయత్నించారు. అయితే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో కన్నా రాజకీయ భవిష్యత్ సహితం అగమ్యగోచరంగా మారింది.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో సంబంధం లేకుండా సోము వీర్రాజు ద్వారా బీజేపీలో చేరడంతో అక్కడా కూడా తగు ప్రాధాన్యత పొందలేకపోయారు. దానితో వైసిపిలోకి చేరేందుకు సిద్ధపడుతున్న సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి భరోసా ఇవ్వడంతో ఆగిపోయారు.

సోము వీర్రాజును బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించనున్న సమయంలో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని వ్యూహాత్మకంగా కన్నాకు మద్దతు పలకడంతో అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగారు. అప్పటి నుండి సోము వీర్రాజుతో పొసగడం లేదు.

అంతేకాదు, బిజెపి ఏపీలో దాదాపు రెండుగా చీలిపోయింది. ఒక వర్గం సోము వీర్రాజు నేతృత్వంలో సీఎం వైఎస్ జగన్ అనుకూల వర్గంగా పేరొందాగా, మరో వర్గం కన్నా నేతృత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు అనుకూల వర్గంగా ప్రచారం పొందింది.

 రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటనలు జరుపుతూ, పార్టీ ఉనికిని కాపాడగలిగినా, 2019 ఎన్నికలలో నోటా కన్నా బిజెపికి తక్కువ ఓట్లు రావడంతో కన్నా నాయకత్వంపై నీలినీడలు వ్యాపించాయి. అనూహ్యంగా సోము వీర్రాజు మళ్ళి బలం సమకూర్చుకొని, కన్నా స్థానంలో రాష్త్ర అధ్యక్షుడు కాగలిగారు. అప్పటి నుండి చెరోదారి అయింది.

అంతేకాదు, కన్నా కార్యవర్గంలో కీలక పదవులలో ఉన్నవారందరికి దాదాపుగా పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇటీవల కన్నా నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా ఏకపక్షంగా మార్చుతూ ఉండడంతో కన్నా తీవ్ర  అసహనానికి లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో కన్నాకు అటు టిడిపి నుండి, ఇటు జనసేన నుండి ఆహ్వానాలు ఉన్నప్పటికీ జనసేనలు అయితే అగ్రనేతగా ఎదగవచ్చని అటువైపే మొగ్గుచూపు తున్నట్లు తెలుస్తున్నది. పైగా, టిడిపితో పొత్తుకు బిజెపి అగ్రనాయకత్వం విముఖంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

గతనెల జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ కన్నా ఇంటికి వచ్చి చర్చలు జరపడంతో అప్పటి నుండి ఆ పార్టీలో చేరనున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల పట్ల ఆగ్రహంతో ఉన్న సోము వీర్రాజు కన్నాను దాదాపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఈ మధ్య కాలంలో  వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా కాకినాడ, నెల్లూరులకు వెళ్లిన కన్నాను కలిసిన బిజెపి నేతలపై సహితం సోము వీర్రాజు చిందులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీలో కన్నా ప్రస్తావన తీసుకు వస్తేనే సోము అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సోము వీర్రాజు వైఖరి వల్లే ఏపీలో బీజేపీకి జనసేన దూరమైందని అంటూ కన్నా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తనతో మాట మాత్రం చెప్పకుండా తాను నియమించిన వారిని జిల్లా పార్టీ  అధ్యక్ష పదవుల నుంచి తొలగించారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బీజేపీ పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న కన్నా రాజకీయంగా తన దారి తాను చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles