ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వైసిపిలో పలువురు కీలక నేతలు ఇతర పార్టీలవైపు దారి చూసుకొంటున్నారు. కొందరు టిడిపిలో చేరేందుకు చూస్తుండగా మరికొందరు జనసేన తీర్ధం పుచ్చుకొంటున్నారు. మరో రెండు రోజులలో మచిలీపట్నంలో భారీ ఎత్తున జనసేన 10వ ఆవిర్భావ సదస్సు జరుగుతున్న సమయంలో ఆదివారం ఇద్దరు మాజీ ఎమ్యెల్యేలు, మరొకొందరు నేతలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసిపిలో చేరారు.
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్ తదితరులకు పార్టీలో చేరారు. వాళ్లందరికీ పవన్ కల్యాణ్ కండువా కప్పి.. సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019ల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీపై అసంతృప్తితో పార్టీని వీడి.. వైసీపీలో చేరారు. ఐతే వైసీపీలో కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు టీవీ రావు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు.
2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని, ఇప్పుడామె హోమంత్రిగా ఉన్నారని టీవీ రావు అన్నారు. కానీ ఇప్పటికీ తన హామీని జగన్ నెరవేర్చుకోలేదని… కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
మరో మాజీ ఎమ్మెల్యే… ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరిపోయారు.
మంగళగిరిలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ తో పాటు వైసీపీకి చెందిన మాజీ ఎమ్యెల్యే కొండ్రు కమల కూడా పాల్గొనడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెకూడా జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి 14 న జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆలివ్ గ్రీన్ ప్యాంట్ ధరించిన పవన్ బ్లాక్ టీ షర్ట్ కళ్లద్దాలు పెట్టుకుని యుద్ధానికి వెళ్తున్న యోధుడిలా కనిపించడంతో అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. “నేను రెడీ జన సైనికులారా మీరు రెడీ” అంటూ క్యాప్షన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
కాగా, మచిలీపట్నంలో జరిగే బహిరంగసభ వేదికగా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు తన రాజకీయ వ్యూహాన్ని వెల్లడిస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి కూడా ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.