జనసేనకు ఎన్నికల గుర్తుపై ఏర్పడిన అస్పష్టతకు తెరపడింది. ఇటీవల ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఎన్నికల గుర్తుల రిజర్వేషన్ జాబితాలో జనసేన గుర్తు లేకపోవడం, జనరల్ గుర్తుగా ఎవరైనా ఉపయోగించుకొనే సౌలభ్యం ఉండడంతో వచ్చే ఎన్నికలలో ఇబ్బంది ఏర్పడగలదనే వాదనలు బయలుదేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తుండగా, ముందు మీ పార్టీకి ఎన్నికల గుర్తు తెచ్చుకోండి అంటూ వైసిపి మంత్రులు ఎద్దేవా చేయడం కూడా జరిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీచేసింది.
జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. దానితో 2024 అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఇదే గుర్తు కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. ఇదివరలో జరిగిన తిరుపతి తదితర ఉపఎన్నికలలో గ్లాస్ ను జనరల్ గుర్తుగా ఎన్నికల కమీషన్ ప్రకటించడం, స్వతంత్ర అభ్యర్థులు ఆ గుర్తును పొందడం జరిగింది.
దానితో గ్లాస్ గుర్తు కోసం జనసేన ప్రత్యేకంగా ఎన్నికల కమీషన్ ను సంప్రదించి, ఆ గుర్తు తమకు కేటాయించేటట్లు చేసుకోగలిగారు. ఈ గుర్తుతో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందారు.
ఎన్నికల ముందు మరో గుర్తును ఎంపిక చేసుకొని, ఆ గుర్తును తమ మద్దతుదారులకు తెలిసేవిధంగా ప్రచారం చేసుకోవడం కూడా అంత సులభం కాదు. మరోవంక, టిడిపి, వైసిపిలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో కొనసాగించడంతో వాటికి గుర్తుల సమస్య తలెత్తదు.
ఆమ్ ఆద్మీ పార్టీని గుర్తింపుపొందిన జాతీయపార్టీగా, సీపీఐ, ఎన్‌సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది. దానితో ఆప్ కు చీపురు గుర్తుతో పాటుగా, సీపీఐకి కంకి కొడవలి గుర్తును, ఎన్‌సీపీకి గడియారం గుర్తు లభించింది.
తాజాగా, గత ఏడాదే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ కి ఏపీలోనూ కారు గుర్తునే కేటాయించారు. దానితో ఏపీని రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు అయింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్‌ఎల్‌డీని కూడా రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. ఈ పార్టీకి ఎలాంటి గుర్తు రిజర్వు చేయలేదు.