జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన పురందేశ్వరి 

Wednesday, January 22, 2025

గత నెలలో ఏపీ పర్యటన సందర్భంగా  వైఎస్  ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు కురిపించిన పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల మాదిరిగానే జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అద్యక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు.

జాతీయ రహదారులకు, విమానాశ్రయాలకు, మరెన్నో కార్యక్రమాలకు కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నదని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్లను గుంతలమయం చేసిందని, కేంద్రం నిధులు ఇస్తున్నా గృహ నిర్మాణం జరగడం లేదని, పరిశ్రమలు రావడం లేదని, పైగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని అంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

విభజన హామీల గురించి ప్రస్తావించకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ప్రత్యేక హోదాకు మించి ఏపీకి సాయం చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి, విశాఖలో రైల్వే జోన్ గురించి కూడా ప్రస్తావించకుండా  బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ అని, బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని ఆమె విమర్శించారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో “నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం.. రేపూ ఉంటాం…” అంటూ రెండు పార్టీల మధ్య పొత్తును ప్రస్తావించారే గాని రాజకీయ కార్యాచరణ గురించి మాత్రం ఓ మాటకూడా చెప్పలేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసి వైసిపి ప్రభుత్వాన్ని ఓడిస్తామని భరోసా కూడా వ్యక్తం చేయలేదు.

ఈ నెల 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా నియమించగా, గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో విజయవాడలోని బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. ” నా మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు ధన్యవాదాలు” అంటూ పార్టీ అధిష్టానంపై కుతజ్ఞతలు తెలిపారు. 

జాతీయ రహదారులు 8623 కిలోమీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని చెబుతూ కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలని ఆమె జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందని ఆమె గుర్తు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరం ప్రాజెక్ట్ ను కుదించి, ఇప్పట్లో పూర్తికాలేని పరిస్థితులు సృష్టిస్తే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడా జాప్యం చేయలేదని అమాయకంగా పురందేశ్వరి చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల రూ.12 వేల కోట్లు పోలవరంకి కేంద్రం ఇచ్చిందని చెప్పారు గాని పునరావాసంకు నిధుల విడుదల ఎందుకు జాప్యం జరుగుతుందో ఆమె చెప్పలేకపోయారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ? అంటూ ఆమె ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని అంటూ మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని ఆమె విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదని ఎద్దేవా చేశారు. 

నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం లేదా? అంటూ ఆమె నిలదీశారు. మద్యం బ్రాండ్ల ద్వారా 20 శాతం ఓనర్‌కు వెళితే 80 శాతం ప్రభుత్వానికి వస్తుందరి.. అందులో 25 శాతం బిల్లులే లేవని ధ్వజమెత్తారు.

మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించుకుంటూ దోచుకున్నారని ఆమె ఆరోపించారు. ఇసుక లోడ్ కొనాలంటే రూ.40 వేలని పేర్కొంటూ  ఇసుక ద్వారా జరుగుతున్న అవినీతిని ఒక సంస్ధకు కేటాయిస్తూ దోచుకున్నారని  పురందేశ్వరి మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని  చెబుతూ విశాఖలో ఒక వ్యక్తి ల్యాండ్ కబ్జా చేస్తే కడప నుంచి వచ్చిన వారు బెదిరిస్తే కోర్టుకు వెళ్లి గెలిచి తన ల్యాండ్ గెలుచుకున్నారని ఆమె గుర్తు చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles