జగన్ సర్కారు.. ఒక స్వామీజీ కథ!

Tuesday, December 24, 2024

జగన్ సర్కారు  పరిపాలన ఎలా సాగుతున్నదో తెలియాలంటే.. ముందుగా ఈ కథ చదవాల్సిందే..

‘‘అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. అతడిది చీకూ చింతా లేని చిన్న కుటుంబం. రోజులు నిమ్మళంగానే గడచిపోతున్నాయి. కానీ అతనికి కొంచెం ఆశ. ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడని విన్నాడు. ఎవరికి ఏ కష్టాలున్నా పరిష్కారాలు చూపిస్తున్నాడని కూడా విన్నాడు. అతని దగ్గరకు వెళ్లాడు. 

‘స్వామీ నాకు ఇల్లు చాలా చిన్నది ఇరుగ్గా ఉంది’ అని చెప్పాడు. 

స్వామీజీ అతడు చెప్పిన వివరాలు అన్నీ విని.. అతనికి ఉన్న రెండు మేకల్ని కూడా ఆరోజునుంచి ఇంటిలోపలే కట్టేయమని చెప్పాడు. పదిరోజుల తర్వాత రమ్మన్నాడు. అసలే ఇల్లు ఇరుకు అని అంటోంటే.. స్వామీజీ చెప్పిన పరిష్కారం ఆ రైతుకు అర్థం కాలేదు. అయినా సరే.. స్వామీజీ చెప్పాడు గనుక తూచా తప్పకుండా చేశాడు. మేకల్ని ఇంట్లోనే కట్టేశాడు. ఇరకాటం పెరిగింది. అయినా భరించాడు. పదిరోజుల తర్వాత వచ్చాడు. ‘ఇల్లు మరీ ఇరుగ్గా ఉంది స్వామీ’ అన్నాడు. 

ఈసారి రైతుకు ఉన్న పాడి ఆవును కూడా ఇంటిలోపలే కట్టేయమని చెప్పాడు స్వామీజీ. యథావిధిగా పదిరోజుల తర్వాత రమ్మన్నాడు. స్వామీజీ మాట తోసిపుచ్చలేక రైతు అలాగే చేశాడు. ఇల్లు మరీ ఘోరంగా ఇరుకు అయిపోయింది. అయినా భరించాడు. పదిరోజుల తర్వాత వెళ్లాడు. స్వామీజీతో మొరపెట్టుకున్నాడు. ‘నరకం కనిపిస్తోంది స్వామీ.. అసలే ఒక్క గది ఉన్న చిన్న ఇల్లు. అందులోనే మేకలు , ఆవు కూడా ఉన్నాయి. నా భార్యాబిడ్డలతో సహా నాకు పడుకోడానికి జాగానే దొరకడం లేదు.. పైగా రాత్రంతా వాటి అరుపులు, నిద్రలేదు’’ అని విలపించాడు. ఇప్పుడు వాటన్నింటినీ బయటకట్టేసి పదిరోజుల తర్వాత రమ్మన్నాడు స్వామీజీ. ఇంటికి వెళ్లిన రైతు.. పదిరోజుల దాకా ఆగకుండా మరురోజే తిరిగివచ్చాడు. 

‘స్వామీ నువ్వెంత మహానుభావుడివి. ఇల్లునాకు చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలమైన ఇల్లు నేనెప్పుడూ అనుభవించలేదు, కృతజ్ఞుడిని’ అని కాళ్లు మొక్కి వెళ్లాడు.’’ 

==

జగన్ సర్కారు కూడా అదే నీతిని పాటిస్తోంది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలో ఎంత అన్యాయం జరిగిందో గుర్తు రావడం లేదు, పాత పెన్షన్ విధానం అనే డిమాండ్ లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ గురించి మొక్కుబడిగా అడుగుతున్నారు. 

వారి ప్రధాన డిమాండ్ ఒకే ఒక్కటి.. దానికోసం పోరాడడమే, దానిని సాధించడమే జీవితాశయంగా పెట్టుకున్నారు. అదే.. ఒకటోతేదీకెల్లా జీతాలు రాబట్టుకోవడం.  అంతే వారికి వేరే ఆశలు లేవు. ఇన్నాళ్లూ ఏ డిమాండ్ల కోసం పోరాటాలు చేశారో.. అవన్నీ వెనక్కుపోయాయి. ఇప్పుడు జీతాలు ఇస్తే చాలురా దేవుడా.. అని జగన్ ను ప్రాధేయపడుతున్నారు. ఏనెల ఏతేదీకి జీతం వస్తుందో తెలియక వారి జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. కుటుంబాల ఆర్థిక నిర్వహణ గాడి తప్పుతోంది. కొంచెం నిమ్మళంగా బతకాలంటే జీతాలు వేళకు వస్తే చాలునని అనుకుంటున్నారు. అందుకోసం ఇప్పుడు పోరాటాల్ని ప్రకటించే పరిస్థితి వచ్చింది. కేవలం జీతాలు రాబట్టుకోవడం కోసం గవర్నరు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే.. పని జరగలేదు సరికదా, గవర్నరే మారిపోయారు. ‘ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలి’ అనే జీవో కావాలి .. అని అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

చిన్న కష్టాల్లోంచి పెద్ద కష్టాల్లోకి నెట్టేసి.. ఆ చిన్న కష్టాలే ప్రసాదించండి మహదేవా అని వారే బతిమాలేలా చేసే స్వామీజీ టెక్నిక్ ను జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి ఎలా వస్తుందో? ఏమో?!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles