జ‌గ‌న్ స‌ర్కారుపై ’ఉద్యమ శంఖారావం‘ ప్రకటించిన ఉద్యోగులు

Friday, November 22, 2024

తమ పట్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌ ఉదాసీన వైఖరికి నిరసనగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటును ప్రకటించారు. ప్రత్యక్ష  ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. హామీలు నెరవేర్చాలని కోరితే ఆంక్షలు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తాము 11వ పీఆర్సీని కోల్పోయామని, ఇస్తున్న రాయితీలను కూడా పోగొట్టుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వానికి సహకరిస్తుంటే ఎంతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. “మీరు మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు.. మా బాధ, ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలియజేస్తున్నా” అంటూ విజ్ఞప్తి చేశారు.

“రేపు మీలో ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించదలచుకుంటే మీ ప్రభుత్వ అధినేతను ప్రశ్నించండి. ఉద్యోగులను ఎందుకు రోడ్ల మీదికి తీసుకువచ్చారని మీరు మీ గౌరవ ముఖ్యమంత్రిని అడగండి. మేం దీనికి బాధ్యులం కానే కాదు. ఉద్యోగ సంఘాల నేతలమైన మమ్మల్ని ఉద్యోగులు ఛీ కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మేం ఇంకా సహకరించడం న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకే ఇవాళ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్నాం” అని బొప్ప‌రాజు చెప్పారు.

ఉద్యమ కార్యాచరణ

  • మార్చి 9, 10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ నిరసన తెలుపుతారు.
  • మార్చి 13, 14 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాలు.
  • మార్చి 15, 17, 20 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు .
  • జేఏసీలోని అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఈ ధర్నాలు నిర్వహిస్తారు.
  • మార్చి 21 నుంచి వర్క్ టు రూల్ మొదలవుతుంది. ఉదయం 10.30 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకే పని చేయడం జరుగుతుంది.
  • మార్చి 21న ఉద్యోగులు సెల్ డౌన్ పాటిస్తారు. ఇప్పుడు ఉద్యోగ విధులన్నీ యాప్ ల సాయంతో చేస్తున్నందున ఆ ఒక్కరోజు ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ ఉపయోగించడు.
  • మార్చి 24న రాష్ట్ర స్థాయిలో ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు.
  • కరోనా ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత చనిపోయిన వారి కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. మార్చి 27న ఆయా కుటుంబాలను కలిసి వారికి భరోసా ఇస్తారు.
  • ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇప్పటికే ఉద్యోగులం మోసపోయాం. రిటైరైన ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి… వాళ్ల కుటుంబాలను కూడా సందర్శిస్తాం. ఓపీఎస్ లో చేర్చుతామని హామీ ఇచ్చినా మార్చలేదు. ఈ నేపథ్యంలో, సీపీఎస్ తో అతి తక్కువ పెన్షన్ వస్తుందని మొత్తుకుంటున్నారో వాళ్ల కుటుంబాలను కూడా సందర్శిస్తాం. 
  • ఇప్పటిదాకా సరెండర్ లీవులు, ఎర్న్ డ్ లీవులకు సంబంధించి ఎలాంటి సప్లిమెంటరీ బిల్లులు తీసుకోనటువంటి వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తాం. జీపీఎఫ్ లోన్లు పెట్టుకుని, పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న కుటుంబాలు, వైద్యం వాయిదా వేసుకున్న కుటుంబాల ఇళ్లకు వెళతాం.
  • ఏప్రిల్ 3న అన్ని జిల్లాల్లో ఛలో స్పందన నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వెళ్లి కలెక్టర్లను కలిసి, మా డిమాండ్లపై ఉద్యోగుల తరఫున మెమొరాండం అందజేస్తాం.
  • ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. ప్రభుత్వం మా డిమాండ్లపై స్పందించని పక్షంలో, ఆ సమావేశాల్లో రెండో దశ ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేస్తాం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles