సతీమణి భారతి కోసమే తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని తీవ్రమైన ఆరోపణలు చేసిన సీనియర్ నేత గోనె ప్రకాష్ రావు జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల ప్రకాష్ రావు దిగవంత వైఎస్ రాజశేఖరరెడ్డి `నమ్మిన బంటు’గా పేరొందారు. ఆయన ప్రభుత్వంలో ఎమ్యెల్యేగా ఉంటూ ఆర్టిసి చైర్మన్ గా కూడా పనిచేశారు.
తాను జైలు కెళ్తే భార్య భారతిని సిఎం చేయాలనేదే జగన్ వ్యూహమని చురకలంటించారు. షర్మిల రోడ్డెక్కడానికి కారణమెవరు? జగన్ కాదా? అని గోనె ప్రశ్నించారు. షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అడిగారు.
ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిసి, ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్ ఆ ఎంపీకి ఫోన్ చేసి ఎందుకెళ్లావ్? సాయం చేయాల్సిన అవసరమేం ఉందని బెదిరించారని గోనె ఆరోపించారు.
షర్మిల ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతు ఆమె కదలికలలపై నిఘా ఉంచుతున్నాడని తెలిపారు. జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘షర్మిల నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదు’’ అంటూ ఘాటుగా వాఖ్యలు చేశారు.
చివరకు తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగిడినా జగన్ కు నచ్చదని, కోపం వస్తుందని అంటూ ప్రకాశరావు ధ్వజమెత్తారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనేవారే ఆయనకు నచ్చుతారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని, వైఎస్సార్‌కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని మండిపడ్డారు. విజయమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ క్యాబినెట్‌లో ఉన్నారని గుర్తు చేశారు. విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని గొనె జోస్యం చెప్పారు. టీడీపీ – జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని, విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే జగన్ ను గెలిపిస్తాయనే వాదనలను కొట్టిపారవేస్తూ సంక్షేమం ఎన్టీఆర్‌తోనే మొదలైందని, కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా? అని నిలదీశారు.