`గడప గడపకు వైసిపి’ దగ్గర నుండి `మా నమ్మకం నువ్వే జగన్’ వరకు పలు ప్రచార కార్యక్రమాల పేర్లతో ఎమ్యెల్యేలు, మంత్రులు దగ్గర నుండి ప్రజల శ్రేణులు అందరిని గతం సంవత్సరకాలంకు పైగా జనం వద్దకు పంపే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రతి ఇంటికి జగన్ స్టిక్కర్ అంటిస్తూ, ఎన్నికల వరకు వైసిపిని జనం గుర్తు పెట్టుకొనే విధంగా భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులలో పెద్దగా మార్పు కనిపించక పోవడం, పార్టీ పట్ల- ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండటం; మరోవంక ఒక వంక నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర, `ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు అనూహ్యంగా ప్రజాస్పందన కనిపిస్తూ ఉండడంతో సీఎం జగన్ లో అభద్రతాభావం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.
అంతర్గతంగా చేయిస్తున్న సర్వేలు సహితం ఆశాజనకంగా లేవని చెబుతున్నారు. ఎమ్యెల్యేలను పిలిచి వారి పనితీరు బాగోలేదని చివాట్లు పెట్టె ప్రయత్నం చేస్తుంటే, కొందరు ఏకంగా తిరుగుబాటు చేస్తూ ప్రభుత్వ పనితీరు బాగోలేదని, దాని ప్రభావం తమపై పడుతుందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇస్తే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామంటూ మూడొంతుల మందికి పైగా అధికార పార్టీ ఎమ్యెల్యేల నుండి టిడిపి నాయకత్వానికి సంకేతాలు వెలువడటం ఈ సందర్భంగా మరింత ఆందోళన కలిగిస్తున్నది.
జగన్ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. గత ఏడాది ఒంగోలులో జరిగిన ప్లీనరీ తప్ప అంతర్గత సమావేశాలు సహితం క్రమంగా జరపడం లేదు. అధికార పర్యటనలకు జిల్లాలకు వెడుతునన హెలికాఫ్టర్ లో వెళ్లి, కార్యక్రమం పూర్తికాగానే తిరిగి రావడమేగాని కనీసం అక్కడున్న పార్టీ నాయకులతో ముచ్చడించే ప్రయత్నం కూడా చేయడం లేదు.
అందుకనే నేరుగా జనంలోనే ఎన్నికల వరకు గడపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్నాయి. మే నెల చివరిలో ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 26 జిల్లాలో జిల్లాకు 10 నుండి 15 రోజుల చొప్పున విస్తృతంగా, దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టివేస్తూ పర్యటనలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక నుండి దాదాపు ప్రతినెలా ఒక్కసారైనా ప్రతి జిల్లాకు వెళ్లే భారీగా బహిరంగ కార్యక్రమాలు జరిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఒకొక్క సంక్షేమ కార్యక్రమం కోసం ఒకొక్క జిల్లాలో అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వెడుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైసిపి చెప్పుచేతలలో ఉండేవిధంగా రెవిన్యూ, పోలీస్ శాఖలలో భారీఎత్తున బదిలీలు చేశారు. కీలక పదవులలో తమకు అనుకూలురైన వారుండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. రెండు, మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నారని సాకుతో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ అటువంటి వారిని బదిలీ చేయమని కోరే అవకాశం లేకుండా ఇప్పుడే కసరత్తు చేస్తున్నారు.