జగన్ రాజకీయ కుట్ర క్రీడలో నిరుపేదలే పావులు!

Sunday, December 22, 2024

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా పేదల మీద ప్రేమతోనే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? లేదా.. ఆ ముసుగులో చంద్రబాబానాయుడు మీద బురద చల్లడానికి పేదల వ్యతిరేకిగా అభివర్ణించడానికి మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో.. సీఆర్డీయే చట్టాన్ని మార్చి మరీ ఆర్ 5 జోన్ అంటూ ఒకటి ఏర్పాటు చేసి.. అక్కడ సుమారు యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి జగన్ పూనుకోవడం అనేది చాలా సందేహాస్పదంగా మారుతోంది. ఒకవైపు కోర్టు కేసులు, కోర్టు అభ్యంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా.. జగన్ సర్కారు సుప్రీంకు వెళ్లి మరీ.. అక్కడ పేదలకు పట్టాలు పంపిణీ చేసేసింది. సుప్రీం కోర్టు సూచన మేరకు, హైకోర్టు తుది తీర్పునకు లోబడి మాత్రమే వాటిపై యాజమాన్య హక్కులు దక్కుతాయని వారికిచ్చిన పట్టాల్లో స్పష్టంగా పేర్కొని మరీ ఇచ్చారు. అసలు స్థలాలపై హక్కులే పూర్తిగా దఖలుపడని లబ్ధిదారులకు ఇప్పుడు ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేయడానికి పూనుకుంటున్నారు. దీనికి సంబంధించి సుమారు 48 వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్రంనుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా మరో న్యాయవివాదంగా మారుతోంది.

తాజాగా దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. అమరావతి ప్రాంతంలోని ఆర్ 5 జోన్ లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల పంపిణీకి మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందా? అక్కడ ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతించిందా అనే సంగతిపై స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అక్కడ ఇళ్లు కట్టబోతున్నదా? అనే సంగతి కూడా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

సుప్రీం కోర్టు పట్టాల పంపిణీకి మాత్రమే ఆదేశించిన నేపథ్యంలో.. హైకోర్టు నుంచి తుదితీర్పు వచ్చే వరకు అక్కడ ఇళ్ల నిర్మాణం అనేది చట్టవిరుద్ధం అవుతుంది. ఈ సంగతి జగన్ సర్కారుకు బాగా తెలుసు. నిర్మాణానికి పూనుకోవడం వలన.. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే సంగతి కూడా తెలుసు. ధిక్కరించి ముందుకు వెళితే.. నిర్మాణాలను హైకోర్టు ఆపివేయిస్తుందనే సంగతి కూడా అందరికీ తెలుసు. కాకపోతే.. చంద్రబాబునాయుడు మీద బురద చల్లడానికి దీనిని అస్త్రంగా వాడుకోవడానికే ఇలా చేశారని వినిపిస్తోంది. అమరావతి రైతులు దీనిపై కోర్టులో పిటిషన్ నడుపుతున్న నేపథ్యంలో.. వారిని చంద్రబాబునాయుడు ఆడిస్తున్నారని.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని బురద చల్లడానికే ఆర్ 5 జోన్ లో చట్టవిరుద్ధంగా ఇళ్ల నిర్మాణం డ్రామా ఆడుతున్నరని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబును బద్నాం చేయడానికి జగన్ ఆడుతున్న రాజకీయ కుట్రక్రీడలో నిరుపేదలే పావులు అవుతున్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles