ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హతలను చంద్రబాబు నాయుడు ఒక రేంజ్ లో ఆడుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో- కాపీ పేస్ట్ మేనిఫెస్టో అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ వేదిక ఎక్కినా సరే అదే పనిగా విమర్శలు కురిపిస్తూ వస్తున్న తరుణంలో చంద్రబాబు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ తీసుకువచ్చిన మేనిఫెస్టోను వైయస్ జగన్మోహన్ రెడ్డి పులిహోర అని, బిసిబేలాబాత్ అని అభివర్ణిస్తున్నారని.. నిజానికి అవి చాలా ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించే అల్పాహారాలని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా తమ మేనిఫెస్టోలో మంచి పౌష్టికాహారంతో పోల్చి చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తాన్ని ఎంతో పుష్టికరంగా ఉన్నతంగా తయారు చేయబోతున్నది అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్లు అయిందని చంద్రబాబు నాయుడు వివరించారు.
పనిలో పనిగా జగన్ అర్హతల గురించి చంద్రబాబునాయుడు ఎడాపెడా సెటైర్లు వేశారు. ‘‘గొప్పమేధావి. ప్రపంచంలోనే అత్యున్నతమైన అతిపెద్ద యూనివర్సిటీలో చదివాడు.. ఆ యూనివర్సిటీ పేరు మాత్రం ఎవ్వరికీ తెలియదు. అలాంటి గొప్ప నాయకుడు.. ఆయన పెద్ద ఆర్థిక వేత్త, సంఘ సంస్కర్త. సంఘ సంస్కరణ అంటే ఏంటంటే.. బాబాయిని గొడ్డలితో లేపేయడం.. వీళ్లూ రాజకీయ నాయకులు, వీళ్లు ఉపన్యాసాలు చెబుతారు’’ అంటూ జగన్ గురించి చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్న జనాకర్షక పథకాలు, మహిళల సాధికారత, స్వావలంబనకు ఉద్దేశించిన పథకాలు సాధించే సత్ఫలితాల గురించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లో ఇప్పటినుంచే బాగా కంగారు మొదలైన సంగతి తెలిసిందే. ఆ కంగారులో వారు అదే పనిగా చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఆ పథకాలు ప్రజలకు ఉపయోగపడేవా? కాదా? అనే సంగతి ఎవ్వరూ మాట్లాడడం లేదు. అవి కాపీ పథకాలు అనే నింద మాత్రమే వేస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా జగన్ మాటల్లోని పదాలనే తీసుకుని బిసిబేళబాత్ లాంటిది.. ప్రజలకు ఎంతో పౌష్టికాహారం అని, తమ మేనిఫెస్టో కూడా రాష్ట్రానికి అలాంటి పౌష్టికాహారం అని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్టు రైటర్ ఎవరో గానీ.. మా మేనిఫెస్టో సూపర్ అని జగన్ తోనే చెప్పించారని చంద్రబాబు ఎద్దేవా చేయడం విశేషం. ఇప్పుడా రైటర్ ను ఏం చేస్తారో అంటూ జాలి కూడా కురిపించారు.
జగన్ మేధస్సు పై చంద్రబాబు సెటైర్లు!
Wednesday, January 22, 2025