జగన్ మాదిరిగా విధ్వంసాలకు పాల్పడం, గ్రామా సచివాలయాలు కొనసాగిస్తాం

Monday, December 23, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరిగా టిడిపి అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఏర్పర్చిన వ్యవస్థలను, నిర్మాణాలను కూల్చివేసే విధ్వంసాలకు దిగబోమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టమైన భరోసా ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా, గ్రామీణాభివృద్ధికి పాటుపడే సర్పంచులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.

`యువగళం’ పాదయాత్రలో భాగంగా, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్ద తుంబాల క్రాస్‌ వద్ద విడిది శిబిరం వద్ద సోమవారం నిర్వహించిన ”పల్లె ప్రగతి కోసం మీ లోకేష్‌” కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్‌ సమాధానమిస్తూ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి ముత్యాలరావు సంధానకర్తగా వ్యవహరించారు.

గ్రామ సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోమని, సర్పంచులతో అనుసంధానించి గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి వచ్చిన సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఎమ్మెల్యేలు సమష్టిగా పనిచేస్తే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు.

‘‘టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదు. వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తాం’’ అని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకా సర్పంచుల బకాయిలు తీర్చేలా కృషి చేస్తామని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

పట్టణాలకు దీటుగా పల్లె సీమలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా తాగునీరు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, గ్రీన్‌ అంబాసిడర్‌ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామని చెబుతూ ‘‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి, మీరందరూ కోరుకుంటున్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది” అని లోకేష్ చెప్పారు.

‘‘ఈ సైకో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్యేలు సైతం దిష్టిబొమ్మలుగా మారారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ విధానం మారాలంటే సచివాలయ వ్యవస్థను పంచాయతీలకు అనుసంధానం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పంచాయతీ ఖాతాల్లోకి మళ్లిస్తాం’’ అని వివరించారు.

టీడీపీ పాలనలో ఎన్జీవోల(స్వచ్ఛంద సంస్థలు)తో కలిసి స్మార్ట్‌ వార్డు, స్మార్ట్‌ విలేజ్‌ చేపట్టామన్నారు. దీనిని సీఎం జగన్‌ తుంగలో తొక్కారని విమర్శించారు. ‘‘గత ప్రభుత్వంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశా. పల్లెసీమల్లో తాగునీటి కష్టాలు తీర్చాలని వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక దానినీ వదిలేసింది. టీడీపీ రాగానే వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ప్రతిపల్లెకు 24 గంటలూ తాగునీరు, ఇంటింటికీ కొళాయి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తాం’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles