జగన్ – బాలినేని మధ్య భేటీ జరిగినా కుదరని సయోధ్య

Wednesday, January 22, 2025

కొంత కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేత, మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో 40 నిమిషాలపాటు భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, భేటీ అనంతరం మీడియా కంట పడకుండానే ఎయిర్​పోర్ట్​కు బాలినేని వెళ్లిపోవడం గమనిస్తే వారి మధ్య సయోధ్య కుదరలేదని స్పష్టం అవుతుంది.

ఇటీవలే నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన తర్వాత తాడేపల్లికి రావాలంటూ కబురు పంపించినా స్పందించలేదు. రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదు.  ఆయన  గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ బాలినేనిపై పార్టీ హైమాండ్​కు ఫిర్యాదులు వెళ్లాయి.

దానితో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో అలిగిన బాలినేనిని పార్టీ పెద్దలు సముదాయించి సీఎం జగన్‌తో మాట్లాడించి శాంతింపజేశారు. ఇప్పుడు ఆయన తన ప్రాంతీయ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. బాలినేని నుండి వచ్చిన ఊహించని ఈ పరిణామంతో అధిష్టానం ఆశ్చర్యానికి గురైంది. 

పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారంటూ బాలినేని అనుచరుల నుంచి వార్తలు రావడంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను తాడేపల్లికి పిలిపించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో తన అసంతృప్తికి గల కారణాలను ఆయన వివరించినట్లు సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే విషయంపై ఆయన జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

‘ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మళ్లీ మీరే కొనసాగాలి’ అని ఈ భేటీలో జగన్, టీటీడీ చైర్మన్, ప్రకాశం జిల్లా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి పదే పదే జగన్ కోరినప్పటికీ బాలినేని ఏ మాత్రం మెత్తపడలేదని తెలిసింది. రీజనల్ కో-ఆర్డినేటర్‌గా కొనసాగేదే లేదని.. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానని బాలినేని తేల్చి చెప్పేశారు.

ఇదే భేటీలో వైవీ సుబ్బారెడ్డిపై సీఎం జగన్ ముందే బాలినేని తన అసంతృప్తి  బాలినేని వెళ్ళగక్కారు. ఇటీవల ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్థన్ రెడ్డిని జిల్లా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి నియమించినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే,  ఈ విషయంలో తనకు ఏ మాత్రం సమాచారం లేదని, తెలియకుండా ఎలా పోస్టింగ్ ఇప్పిస్తారు? అని సీఎం ముందే నిలదీసిన్నట్లు చెబుతున్నారు. 

మరోవంక, తమ వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు ముఖ్యమంత్రి జగన్ కు బాలినేనిపై ఫిర్యాదు చేశారు. తమను పట్టించుకోకుండా వర్గవిభేదాలను ప్రోత్సహిస్తున్నారంటూ అధిష్టానం దృష్టికి తెచ్చారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్ బాలినేనిని వివరణ అడిగినట్లు సమాచారం.

పార్టీలో మొదటి నుంచి ఎంతో కీలకంగా వ్యవహరించిన బాలినేని పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల్లో ఆయనకు మంచిపట్టు ఉంది. దీంతో ఆయన్ను బుజ్జగించి శాంతింపజేసేందుకు అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు.

ఈక్రమంలోనే అధిష్టానం నుంచి ఆయనతో రాయబారం సాగించింది. రెండ్రోజుల క్రితమే సీఎంవో నుంచి ధనుంజయరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతో మంతనాలు జరిపారు.  దానితోనే ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన్నట్లు చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డిని బుజ్జగించి మళ్లీ తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బాలినేనికి ఫోన్‌ వెళ్లినట్లు సమాచారం. కానీ, బాలినేని తన ఆలోచన మార్చుకోవటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.  తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని, కేవలం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటున్నట్లు పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారని తెలుస్తోంది.  ఏదేమైనా ఎన్నికల సంవత్సరంలో బాలినేని వంటి కీలక నేత అస్త్రసన్యాసం చేయడం అధికార పార్టీకి ఇబ్బందికరంగానే కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles