జగన్ పై సోషల్ మీడియా పోస్టులు! ఓ యువకుడి అరెస్ట్!

Tuesday, May 7, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని అభియోగాలతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని, పోలీసులు రిమాండ్ కు పంపే ప్రయత్నం చేయడం  రాజకీయంగా దుమారాన్ని రేపింది.

కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం టౌన్ కి చెందిన పొందూరు అంజాన్ ను 29వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదు వచ్చిందని ఎస్సైలు శ్రీనివాస్‌, రమే్‌షబాబు, సిబ్బందితో బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న అంజన్‌ను బలవంతంగా తీసుకువెళ్లారు.

రెండు గంటల్లో పంపిస్తామని చెప్పి ఎంతసేపటికి ఎక్కడ ఉన్నాడో సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు కూడా తీసుకోలేదన్నారు. అంజాన్ ఇంటికి వచ్చిన పోలీసులు ఇంట్లో ఉన్న వస్తువులను తనిఖీ చేసి అంజాన్ కు చెందిన ల్యాప్‌టాప్‌, ఫోన్లు పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళారు.

గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లారని తర్వాత అచూకీ చెప్పలేదని అతని తల్లి ఆందోళనకు దిగారు. తన కుమారుడుని పోలీసులు తీసుకుని వెళ్లి 24 గంటలు దాటినా అతని వివరాలు చెప్పటం లేదని తల్లి ఆందోళనకు దిగడం, కుమారుడి ఆచూకీ తెలియ చేయాలని వేడుకోవడం కలకలం రేపింది.

గన్నవరంకు చెందిన ఎన్నారై పొందూరి కోటిరత్నం అంజన్‌ అమెరికాలో చదువుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగం మానేసి స్వదేశానికి వచ్చి ఇంటిలోనే ఖాళీగా ఉంటున్నాడు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వానికివ్యతిరేకంగా అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నాడని ఫిర్యాదు అందిందంటూ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

యువకుడిని అదుపులోకి తీసుకోవడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే గన్నవరం పోలీసులు ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో ప్రముఖ వ్యక్తులపై పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సైబర్‌ నేరగాడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్టు డీఎస్పీ కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వచ్చింది.

అంజన్‌ చౌదరి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అంజన్‌ యువగళం అక్కౌంట్‌ ద్వారా విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నాడని పేర్కొన్నారు. అతడి మొబైల్‌, ట్యాబ్‌, తదితర ఎలక్టానిక్‌ గాడ్జెట్‌ పరికరాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబెరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు.

నిందితుడు వాడిన ల్యాప్‌టాప్‌, ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ప్రకటించారు. అతనిపై సైబర్ బుల్లిషీట్ తెరుస్తున్నట్లు ప్రకటించారు. పైగా, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ప్రకటన విడుదల చేశారు. అతనికి అసహజ లైంగిక అలవాట్లు ఉన్నాయని, హోమో సెక్సువల్ అంటూ ప్రకటించారు.

అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో గురువారం సాయంత్రం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీష ఎదుట హాజరుపరిచారు. నిందితుడు ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా, రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రిమాండు విధించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు.

ఈ కేసులో రిమాండు అవసరం లేదని, నోటీసులిస్తే సరిపోతుందని నిందితుడి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండు విధించటానికి నిరాకరించారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపటమే అంజన్‌ చేసిన తప్పా అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు, టీడీపీ నాయకులు బచ్చుల సుబ్రమణ్యం, బుస్సే నాగ ప్రసాద్‌లు ప్రశ్నించారు. గన్నవరంలో అంజన్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles