జగన్ పై వికటిస్తున్న అమిత్ షా, జెపి నడ్డా `రివర్స్ గేమ్’

Sunday, December 22, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అడుగంటి పోయాయని అంటూ ఘాటుగా విమర్శలు చేయడం ద్వారా గత నాలుగేళ్లుగా వై ఎస్ జగన్ కు అండగా ఉంటున్న తమ `తప్పిదాల’ నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా చేసిన ప్రయత్నాలు వికటించినట్లు స్పష్టం అవుతుంది.

ఈ ఇద్దరు నేతల పర్యటనలకు కొద్దీ రోజుల ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఢిల్లీలో అమిత్ షా భేటీ కావడం, ఆ వెంటనే ఇటువంటి విమర్శలకు దిగడం ద్వారా తిరిగి టిడిపి- బిజెపి దగ్గరవుతున్నాయనే సంకేతం కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏది ఏమైనప్పటికీ గత అనుభవాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులు ఖాయమైతే మాత్రం జగన్ కు నష్టం తప్పదని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఇన్నాళ్లు జగన్ కు అండగా ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం ఒక్కసారిగా జగన్ పై విరుచుకు పడటం ద్వారా జగన్ వ్యతిరేకులతో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది.

ఎంతగా ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తున్నా, వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న నేపధ్యంలో బీజేపీ మద్దతు ఇస్తున్న జగన్ కు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ చేజారిపోకుండా చేసేందుకు  బీజేపీ పెద్దలు ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని, లోలోన మాత్రం జగన్ కు నష్టం వాటిల్లకుండా ఉండేలా బీజేపీ పెద్దలు `రివర్స్ గేమ్’ ఆడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

`మనకు ఇక మోదీ మద్దతు ఉండకపోవచ్చు’ అంటూ ఈ విమర్శల గురించి సీఎం జగన్ చాలా సౌమ్యంగా స్పందించారు. కనీసం తనది అవినీతి ప్రభుత్వమని వారు చేసిన విమర్శలను ఖండించే ప్రయత్నం చేయలేదు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఎదురుదాడికి దిగడంతో బిజెపి నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.

“మా అవినీతి మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చినా?” అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా అమిత్ షా, జివిఎల్ నరసింహారావులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా వైసిపి- బిజెపి ఆడుతున్న దొంగ నాటకాన్ని బైట పడేశారు. “ఇప్పటి వరకు మేము ఎన్ని తప్పులు చేస్తున్నా నోరుమెదపకుండా అండగా ఉంటూ వచ్చిన మీకు ఇప్పుడు అకస్మాత్తుగా మాలో తప్పులు కనిపిస్తున్నాయా?” అన్నట్లు ఆయన మాటలవెనుక మర్మం వెల్లడి అవుతుంది.

“జగన్ కు బిజెపి ఎప్పుడు మద్దతుగా లేదు” అంటూ వీరి విమర్శలకు మొహమాటానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేలవంగా సమాధానం ఇచ్చిన్నట్లుంది. కానీ మంత్రుల విమర్శలకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జెపి నడ్డా మాట్లాడి వెళ్లారని మంత్రులు అంటుంటే బిజెపి నేతలు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పై వారిద్దరూ ఎందుకు మాట్లాడలేదని బొత్సా నిలదీశారు.  `మిమ్ములను మేము విమర్శించామనే ఇవి మీకు గుర్తు వచ్చాయా?’ అంటూ సోము వీర్రాజు కూడా తామిద్దరమూ దొంగలమే అన్నట్టు సమాధానం ఇచ్చారు.

పైగా, టిడిపి నుండి వచ్చి బీజేపీలో చేరిన వారి మాటలకు తలొగ్గి అమిత్ షా, నడ్డా ఆ విధంగా మాట్లాడారని కూడా అన్నారు. మరో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి ప్రధాని మోదీ, సీఎం జగన్ చాలా మంచి స్నేహితులని; అయితే మోదీకి – అమిత్ షాకు దూరం పెరిగిందని, అందుకనే జగన్ పై అమిత్ షా విమర్శలు కురిపిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అమిత్ షా కన్నెర్ర చేస్తే…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్నెర్ర చేస్తే మరుక్షణంలో ఏపీలోని మద్యం స్కామ్ మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.  ‘‘విశాఖ సభలో అమిత్ షా ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్‌ను ప్రస్తావించారు. ఇప్పటి వరకు జగన్ రెడ్డిని పాపం పసివాడు అనుకున్నట్టున్నారు. కానీ భారీ అవినీతి పరుడునే విషయం ఇప్పుడే తెలిసొచ్చినట్టుంది” అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ పాలనలో మద్యం పాలసీలో రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని ఎంత మందిని జైళ్లలో పెట్టారో, అందులో ఏపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో దేశమంతా చూస్తోందని గుర్తు చేశారు.  జగన్ రెడ్డి పాలనలో ఆయన చెప్పిన మందే కొనాలి.. క్యాష్ మాత్రమే కట్టాలని ధ్వజమెత్తారు.కూరగాయల దుకాణాలు, కిళ్లీ అంగళ్లలో కూడా పేటీఎం స్కానర్లు కనిపిస్తున్నాయని తెలిపారు.
అయితే, ఏపీ ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం ఓన్లీ క్యాష్. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి  మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఏడాదికి రూ.30 వేల కోట్లు, నాలుగేళ్లలో లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగితే ప్రభుత్వ ఖజానాకు ఎంత జమయింది?.వైసీపీ నేతల జేబుల్లోకి ఎంత చేరిందో? దేవుడికే తెలియాలని చెప్పారు.

రాష్ట్రంలోని మద్యం డిస్టలరీలన్నీ జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో పౌరులైనా తమకు ఇష్టం వచ్చిన బ్రాండ్ మద్యం తాగొచ్చు. ఏపీలో మాత్రం జగన్ రెడ్డి చెప్పిన మద్యమే తాగాలి.. చావాలని అంటూ పరోక్షంగా బిజెపి నేతలలకు సోమిరెడ్డి చురకలు అంటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles