2019 ఎన్నికల ముందు ఎన్డీయే నుండి వైదొలిగి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో చేతులు కలపడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల ఆగ్రహంతో కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని వైసీపీలో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఒక విధంగా 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ 151 సీట్లతో అఖండ ఆధిక్యత సాధించడంలో కీలకమైన సహకారం అందించారు. అందుకనే బీజేపీ అభ్యర్థులకు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.
ఆ తర్వాత కూడా రాష్ట్ర బిజెపి నేతలో అధికారంలో ఉన్న జగన్ పై కన్నా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సిబిఐ కోర్టులో మూలుగుతున్న అక్రమార్జనల కేసులు ముందుకు సాగకుండా జగన్ కు కేంద్ర ప్రభుత్వం రక్షాకవచంగా ఉన్నదనే విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. మరోవంక, జగన్ సహితం కేంద్ర ప్రభుత్వం తమ బాంధవ్యం `ప్రత్యేకమైనది’ అని చెప్పుకొంటూ ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలో మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే, కొద్ది రోజులుగా జగన్ పై సిబిఐ కేసులు వేగం పెంచడం, పార్లమెంట్ లో ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం తేల్చి చెప్పడం, మరోవంక వైసిపి నేత విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపిని నిలదీయడం వంటి పరిణామాలను గమనిస్తే జగన్ – బీజేపీ హనీమూన్ ముగిసినట్లే అనిపిస్తున్నది. పరస్పరం కత్తులు దూసుకోవడం ప్రారంభమైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా జగన్ ప్రభుత్వానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అండగా ఉండడాన్ని రాష్ట్రంలోని ఆ పార్టీ మాడత్తుదారులు సహింపలేక పోతున్నారు. జగన్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉండడం, క్రైస్తవ మత ప్రచారంతో పాటు మతమార్పిడులు కూడా ఊపందుకోవడంతో జగన్ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఏపీ క్రైస్తవ రాష్ట్రంగా మారుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకనే జగన్ కు దూరంగా జరగాలనే వత్తిడులు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నాయి.
రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం చోటు చేసుకున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అదే సమయంలో జగన్ కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు సాగుతోంది. వివేకా కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ, ఆ తర్వాత జగన్ ఓఎస్డీ, ఆయన భార్య భారతి సహాయకుడు నవీన్ ను కూడా విచారించింది.
దీంతో పాటు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణకు నిందితులకు సమన్లు కూడా పంపింది. దీంతో వివేకా కేసు త్వరలో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జగన్ కేసుల్లోనూ విచారణ వేగంగా సాగుతోంది. ఎన్నికలకు ముందు ఈ కేసుల్లోనూ సీబీఐ, ఈడీ కోర్టులు తమ తీర్పులు వెలువరించేందుకు సిద్ధమవుతున్నాయి.
గతంలో రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనంటూ హైకోర్టులో అఫిడవిట్ చేసిన కేంద్రం ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు గురించి బిల్లు ప్రవేశపెట్టే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రంను సంప్రదింపలేదని రాజ్యసభలో నిష్టూరంగా కేంద్రం మాట్లాడింది. అంతేకాదు, రాజధానిగా అమరావతి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పడినదే అని స్పష్టం చేస్తూ, దానిని మార్చాలి అంటే కేంద్రమే చేయాలన్నరీతిలో మాట్లాడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ రాష్ట్ర రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరినే అవలంభించడం గమనార్హం.