ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్యోపదేశంగా తమ దయాదాక్షిణ్యాలపైననే జగన్ ప్రభుత్వం ఇక్కడ మనుగడ సాగిస్తున్నట్టు ఒప్పుకున్నారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై `ఛార్జ్ షీట్’ ను మేరీ 5 నుండి వరుసగా విడుదల చేస్తామని ప్రకటించిన ఆయన ఇప్పుడా ఊసెత్తడం లేదు.
‘ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రజల కోసమే జగన్మోహన్‌రెడ్డికి, బీజేపీ సాయం చేస్తుంది. దీనిలో వ్యక్తిగత ఆపేక్షలు ఉండవు’ అంటూ సోము వీర్రాజు తాజాగా చేసిన ప్రకటన జగన్ ప్రభుత్వాన్ని కాపాడటమే బిజెపి ప్రధాన అజెండాగా స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా, “ఆయన వ్యవహారశైలి డిఫరెంట్” అంటూ జగన్ కు కితాబు కూడా ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌లు వెయ్యమన్నసోము వీర్రాజు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అంటూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చప్పడం విడ్డూరమని అంటూ పది రోజునుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని ధ్వజమెత్తారు.
కేంద్రానికి మద్దతు ఇస్తే ఎటువంటి తప్పులు చేసిన ఆమోదయోగ్యం అనే ధోరణి సిగ్గుచేటని బిజెపి వైఖరిని ఎండగట్టారు. బిజెపికి ఏపీకి ఎంతగానో నష్టం చేస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ నోరెత్తకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని పార్టీలు (వైసీపీ, టీడీపీ, జనసేన) ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకే తపనపడుతున్నాయని రాఘవులు గుర్తు చేశారు. ఏదేమైనా, బీజేపీని ఓడించడానికి ఎవరు మద్దతిస్తే వారితోనే పొత్తు అని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణను పాటించడం లేదని, విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని అంటూ కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా ఒకవంక ఆక్షేపిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అడగగానే రుణపరిమితులను ఇష్టం వచ్చిన్నట్లు కేంద్రం పెంచేస్తున్నది. తెలంగాణ వంటి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మాత్రం ఈ విషయంలో వేధిస్తున్నది.
ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 30,275 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు కేంద్రం ఏపీ ప్రభుత్వంకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఎన్నికల సంవత్సరంలో జగన్ ప్రభుత్వంకు ఆర్థికంగా పెద్ద ఊరట ఇచ్చినట్లయింది. ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ పై ఆధారపడుతున్న ఏపీ ప్రభుత్వంకు ఎన్నికల సంవత్సరంలో వెసులుబాటు కలిగించే విధంగా ఈ అనుమతి ఇచ్చినట్లు స్పష్టం అవుతుంది.
జగన్ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికలలో తమ సత్తా నిరూపించుకుంటామని చెబుతూ వస్తున్న బిజెపి ఇప్పుడు ఆ ప్రభుత్వం అక్రమాలకు బాసటగా నిలబడుతూ, టిడిపి – జనసేన కలిసి ఏమైనా అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఎత్తుగడగా వెల్లడవుతుంది.