జగన్ పై తిరుగుబాటుకు సిద్ధంగా ప్రజానీకం.. చంద్రబాబు ధీమా

Monday, December 23, 2024

రాష్ట్ర విభజన సమయంలో కంటే జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో రాష్ట్రం ఎక్కువగా నష్టపోయినట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్ నగరంలో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ నాయకులతో కలిపి టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారంనాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఒక విధంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జగన్ ను ఇంటికి పంపటమే విధ్వంసం నుండి ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడేందుకు ఏకైక మార్గమని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపిచ్చారు.

జగన్ పాలనపై  ఏపీలో తిరుగుబాటు మొదలైందని చెబుతూ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని… రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించారని గుర్తు చేశారు.

ఇది చదువుకున్నవారిలో వచ్చిన తిరుగుబాటని చెబుతూ ఇదే తిరుగుబాటు రేపు ప్రజల్లోనూ చూడబోతున్నారని తెలిపారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని.. ఇది చారిత్రక అవసరమని, కచ్చితంగా వస్తామని స్పష్టం చేశారు. ఏపీని బాగు చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెబుతూ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం స్పష్టం చేశారు.

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ కొనసాగించారని చంద్రబాబు కొనియాడారు. కానీ వైఎస్ జగన్ కు విధ్వంసమే పాలనగా మారినదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలని చూస్తే జగన్ రెడ్డి చంపేశాడని ధ్వజమెత్తారు.

29వేల రైతులు, 33వేల ఎకరాల భూమిని ఇచ్చి త్యాగం చేశారని పేర్కొంటూ ఇదంతా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతోనే చేశారని చెప్పారు. నాడు శంషాబాద్ కోసం 5వేల ఎకరాల భూమిని తీసుకున్నామని,  ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆలోచించాలని కోరారు. ఏపీ రాజధాని అంటే… మూడు ముక్కలాట ముచ్చట చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశామని చెబుతూ  దేశంలోనే మొదటిసారి కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి, జాతికి అంకితం చేశామని గుర్తుచేశారు. దీని ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని చెబుతూ 10 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని చదన్రాబాబు భరోసా ఇచ్చారు.  2014లో విభజన జరిగింది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు.

“నేను ఆ రోజు హైటెక్స్ సిటీ కడితే .. రాజశేఖర్ రెడ్డి కూల్చివేస్తే ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా? ఓఆర్ఆర్ రద్దు చేస్తే ఇంత అభివృద్ధి ఉండేదా? జీనోమ్ వ్యాలీ రద్దు చేస్తే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేదా? మా తర్వాత వచ్చిన ఈ తెలంగాణ అభివృద్ధిని ఆపలేదు” అంటూ వారందర్నీ అభినందించాల్సిందే అని తెలిపారు.

తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని చెబుతూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం జాతి ఉద్ధరణ కోసమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందన్ని చెప్పానారు. తెలుగువారి కోసం పని చేసే పార్టీ కూడా తెలుగుదేశమే అని స్పష్టం చేశారు. తెలుగు జాతి అంటే తెలుగుదేశమని అంటూ పెత్తందారి, దళారి వ్యవస్థను రూపుమాపిన చరిత్ర తెలుగుదేశానిదే అని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా దేశంలో సంక్షేమ పథకాలకు నాంది పలికిన పార్టీ కూడా టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles