వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ కంపెనీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఒక దశలో చిత్తూర్ జిల్లాలో తమ కంపెనీలను మూసివేసి పొరుగున ఉన్న తమిళనాడుకు తరలి వెళ్లడం కోసం సిద్ధపడిన గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు తెలంగాణాలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆసక్తి కలిగిస్తున్నది.
అమర రాజా బ్యాటరీస్ కంపెనీకి చెందిన రెండు యూనిట్లను మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు కూడా జారీ చేయగా, ఆ తర్వాత రెండు సార్లు సంస్థకు విద్యుత్ నిలిపివేయటం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో అమర రాజా కంపెనీ చెన్నైకి మారిపోతుందని వార్తలు వచ్చినా, ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్ సిద్ధం కావడం ఆసక్తి కలిగిస్తోంది
పర్యావణ నిబంధనల ఉల్లంఘనల పేరుతో అమర రాజా కంపెనీలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో హైకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందవలసి వచ్చింది. అదే విధంగా వారి కంపెనీలకు చెందిన పలు ప్రదేశాలపై ప్రభుత్వ అధికారులు దాడులు జరిపి, పలు కేసులు నమోదు చేశారు. ఈ వేధింపులతో విసుగు చెందిన జయదేవ్ కొద్దికాలంగా టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరింపకుండా వ్యాపారులకే పరిమితం అవుతూ వస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అమర రాజా కంపెనీలకు అన్ని సదుపాయాలు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. అటువంటి తరుణంలో తాజాగా అమర రాజా బ్యాటరీస్ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అమరరాజా సంస్థ ఏంఓయూ కూడా చేసుకుంది.
విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను నూతన సాంకేతికతతో, వచ్చే పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ బ్యాటరీల ఉత్పత్తి కేంద్రం కానుంది. పైగా, 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది.
ఇప్పటికే అమర రాజా సంస్థకు సంబంధించి ఏపీలో పలు యూనిట్లు ఉండగా.. తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో ప్రస్తుతం మరో యూనిట్‌ను తెలంగాణలో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని కొనియాడటం ద్వారా ఏపీలో జగన్ ప్రభుత్వం కారణంగా పారిశ్రామిక ప్రగతి ఆగిపోయినదని పరోక్షంగా గల్లా జయదేవ్ ధ్వజమెత్తిన్నట్లు అయింది.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అమరరాజా 37 సంవత్సరాలు సేవలందిస్తోందని గుర్తు చేసిన మంత్రి, తెలంగాణకు వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇదేనని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత తమ సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితమయ్యాయని గల్లా జయదేవ్ తెలిపారు. పలు కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టలేకపోవయామన్నారు. తెలంగాణలో ఈవీ వాహనాల రంగం పుంజుకుంటోందన్న జయదేవ్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి సర్కార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
ఇలా ఉండగా, మరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మండిపడ్డారు. సుమారు ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా వంటి పరిశ్రమలను కూడా వైసీపీ ప్రభుత్వం.. పారిపోయేలా చేస్తోందని ఆరోపించారు.