ఏపీలో రాబోయే ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో పర్యటనకు తలపడుతుంటే ఎగతాళి చేస్తున్న వైసీపీ, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం హర్యానాలోని కురుక్షేత్ర వద్ద వారాహి యజ్ఞం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ యజ్ఞం తలపెట్టడం గమనార్హం.
2019 ఎన్నికలకు ముందు జగన్ తో విశాఖపట్నంలో ఓ యజ్ఞం చేయించిన శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో భారీ స్థాయిలో ఈ యజ్ఞం జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షిస్తున్నారు. దీనికి అష్టోత్తర శతకుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేశారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో మరెవ్వరు తలపెట్టినట్లు దాఖలాలు లేవని చెబుతున్నారు.
శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం సందర్భంగా యజ్ఞభూమిలో చండీ మాత మహా వారాహి అవతారంలో దర్శనమిచ్చింది. మరోపక్క యజ్ఞంలో 13వ రోజు చండీ మాతను ఆరాధిస్తూ 6912 పారాయణ హోమాలు నిర్వహించారు. యజ్ఞంతో పాటు ఒకే సమయంలో సప్తశతీ పారాయణ కూడా చేపట్టారు.
కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16 రోజులపాటు శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం జరుగుతోంది. ఈనెల 26వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగుతుంది. పూర్వకాలంలో చత్రపతి శివాజీ మహరాజ్, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటివరకు సహస్ర, అయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. కలియుగంలో ప్రార్ధించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు.
శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760మంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. వీరికి సహాయకులుగా మరో 400 మంది బ్రాహ్మణులు ఉంటారు. మొత్తం 2160 మంది బ్రాహ్మణోత్తములు 22 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారు. వీరిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రప్పించారు.
వీరంతా యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన 110 హోమ గుండాల్లో వీరంతా కలిసి రోజుకు 7040 చండీ పారాయణ హోమాలను నిర్వహిస్తున్నారు. 16 రోజుల పాటు ఒక లక్షా 12వేల 640 చండీ పారాయణ హోమాలు చేస్తారు. ఈ యజ్ఞం కోసం 55 ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. నిర్వహణ బాధ్యతను గుంతి మాత ఆశ్రమం చేపట్టగా పర్యవేక్షణ బాధ్యత విశాఖ శ్రీ శారదా పీఠం భుజానకెత్తుకుంది.