2019 ఎన్నికలలో గెలుపొందడం కోసం ప్రత్యక్షంగా సహకారం అందించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ తర్వాత అవినీతి కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తులో ప్రగతి లేకుండా అడ్డుకోవడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొండంత అండగా ఉండటం బహిరంగ రహస్యమే. కొందరు ఏపీ బీజేపీ నేతలు వైఎస్ జగన్ భక్తులని, నెలవారీ ప్యాకేజీలో ఉన్నారని అంటూ పలు సందర్భాలలో కొందరు బిజెపి నేతలే తీవ్రమైన ఆరోపణలు చేశారు.
స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 16 నెలల క్రితం తిరుపతి వచ్చిన్నప్పుడు జగన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంబంధాలు మీకు అనవసరం, ఏపీలో ఒక రాజకీయ పక్షంగా మనుగడ సాగించాలంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయవలసిందే అంటూ ఏపీ బిజెపి నేతలను ఘాటుగా మందలించవలసి వచ్చింది. అప్పటి నుండి అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న, ఆ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడటంలో మాత్రం ముందుంటున్నారు.
అయితే వైఎస్ జగన్ పాలన పట్ల విసుగు చెందుతున్న ప్రజలలో ఆయనకు మద్దతుగా ఉంటున్న బిజెపి పట్ల కూడా ఆగ్రవేశాలు కలుగుతున్నట్లు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలు స్పష్టం చేశాయి. గతంలో ఎన్నడూ ఎరుగనంత ఘోరంగా బిజెపి అభ్యర్థులు ఓటమి చెందారు.
విశాఖలో ఓటమి అనంతరం జనం బిజెపి – వైసీపీలను ఒకటిగానే చూస్తున్నారని బీజేపీ రాష్త్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొనడం గమనార్హం. మరో వంక, ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత సహితం పలు రూపాలలో స్పష్టం అవుతూ వస్తున్నది.
అందుకనే, బిజెపి – వైసిపి ఒకటి కాదని, తాము ప్రతిపక్షం కానీ, వైసిపి మద్దతుదారులం కాదని అంటూ బిజెపి నేతలు ఒకరి తర్వాత మరొకరు సంజాయిషీ ఇచ్చుకునే రీతిలో ప్రకటనలు చేయాల్సి వస్తుంది. పైగా, జగన్ కు మద్దతుదారులుగా పేరొందిన నేతలే జనం ముందుకొచ్చి విమర్శలు చేస్తుండటం వినోదం కలిగిస్తుంది.
జగన్ ఏపీకి సీఎం కావడం అక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఘాటుగా విమర్శించారు. జగన్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటుండని పేర్కొంటూ ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని ఆయన హెచ్చరించారు. జగన్ నాశనమైపోతారని… ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదని శాపం పెట్టారు.
ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకన్న వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని దియోధర్ తెలిపారు.
వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటం ద్వారా బీజేపీ – వైసీపీ మధ్య ఎటువంటి సంబంధాలు లేవనే విషయం స్పష్టమైందని తెలిపారు.పైగా, జగన్ తప్పు చేసి ఉంటే ఆయన కూడా జైలుకెళ్లక తప్పదని బిజెపి నేత హెచ్చరించారు.
ఇక, తాజాగా ఢిల్లీలో వైసిపి మంత్రులు అందరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుండే బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు సహితం స్వరం పలికారు.
వైసీపీ, బీజేపీ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పైగా, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పీఠంపై నుంచి వైసీపీని పడగొట్టడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఏపీలో తమది ప్రతిపక్ష పాత్ర అని ఎంపీ జీవీఎల్ పేర్కొంటూ వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
‘‘బీజేపీ, వైసీపీ బంధంపై నేనో, మరొకరో… ఏం చెప్పారన్నది కాదు. ప్రజలు ఏం అనుకొంటున్నారన్నది ముఖ్యం. ఆ రెండు పార్టీల మధ్య బంధం లేదని ప్రజలు అనుకోవాలి. మేం చెప్పగానే ప్రజలు విశ్వసించరు. ఆ పార్టీల మధ్య బంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు’’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బిజెపి నేతల ప్రకటనలకు స్పందిస్తూ ఎద్దేవా చేశారు.