ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న ఢిల్లీ వెళ్లి, 5, 6 తేదీలతో ప్రధాని మోదీతో పాటు కీలక మంత్రులను కలిసి, రాగానే 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుపుతున్నారు. గత నెలలో సహితం ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన కొద్దీ రోజులకే మంత్రివర్గ సమావేశం జరిపారు.
కొంత కాలంగా రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలనను సహితం రహస్యంగా ఉంచుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతున్నారు. ముఖ్యంగా భూముల కేటాయింపు, ఆస్తుల తాకట్టు, రుణాల సేకరణ వంటి అంశాలలో గతంలో ఎన్నడూ ఎరుగని గోప్యతను పాటిస్తున్నారు.
గత ఢిల్లీ పర్యటన తర్వాత కూడా సీఎం జగన్ జరిపిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే దిశగా సంకేతాలు ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. అయితే ఈ విషయంలో ఆయన బీజేపీతో అవగాహనకు ఇప్పటికే వచ్చారని, ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టేలా చూసుకున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
ఈ విషయంపై తనకు స్పష్టత ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాదాదాపు ప్రతి సభలో చెబుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహితం ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. గత నాలుగేళ్లుగా దాదాపుగా ప్రతినెలా జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. అయితే ఈ మధ్య మాత్రం కీలక సమాలోచనల కోసమే వీడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
కానీ వైసీపీ నేతలు ఎవ్వరూ ఖండించడం లేదు. గత ఏప్రిల్ నుండి వైఎస్ జగన్ ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు విడుదల చేయడం, అడిగిందే తడువుగా రుణపరిమితులు సడలించడం చేస్తుండడంతో ఇప్పటివరకు పుష్కలంగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి.
అయితే, ఈ ఏడాదికి కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితికి దాదాపుగా ముగిసింది. వచ్చే నెల నుంచి జీతాలివ్వడం మరింత కష్టం కావొచ్చని చెబుతున్నారు. ఇక పథకాలకు బటన్లు నొక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడి ఆస్తులనూ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే కేంద్రం అదనపు అప్పులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
అనుకున్న విధంగా నిధులు సమకూరని పక్షంలో ఎన్నికల ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై తుది నిర్ణయం కోసమే ప్రస్తుతం జగన్ ఢిల్లీ వెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఒక వంక ఆర్ధిక సమస్యలతో పాటు రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయాలు సహితం జగన్ కు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనట్టు అర్ధం అవుతుంది. వాటికి బీజేపీ తోడైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది.
అందుకే టీడీపీ, జనసేన వైపు వెళ్లకుండా బీజేపీ పెద్దలను విన్నవించుకోవడంతో పాటు జనసేనను సహితం టిడిపితో చేతులు కలపకుండా అడ్డుకట్ట వేసేందుకు బిజెపి పెద్దల సహకారం కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశమున్నందని, అన్ని సందర్భాలలో ఎన్డీఏకు వెన్నుదన్నుగా ఉంటున్నానని అంటూ జగన్ కేంద్ర నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇంకోవంక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ మొదలైంది. ఈ నెలాఖరు లోగా డిశ్చార్జ్ పిటీషన్లపై వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంటే, వచ్చే నేలనుండి ట్రయిల్ ప్రారంభించాలనే సంకేతం ఇచ్చారు. ఎన్నికల ముందు ట్రయిల్ ప్రారంభం కావడం ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
అలాగే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తాజాగా సమర్పించిన చార్జిషీట్ లోని అంశాలను సహితం ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల మధ్య సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.