కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలసి రావడంపై అసెంబ్లీలో శనివారం గందరగోళం జరిగింది. ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? రాష్ట్ర ప్రయోజనాలకోసం ఏమి చేసుకొచ్చారు? అని టిడిపి ఎమ్యెలు నిలదీస్తే సమాధానాలు చెప్పలేక వారిని సభనుండి బహిష్కరించారు.
స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కలసి వస్తున్నా ఆ విషయాలు ప్రజలకు వెల్లడించడంలేదని నిలదీశారు.
ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ నిరసన చేపట్టారు. పోలవరానికి నిధులెంత తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా? అంటూ నినాదాలు చేశారు.. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ నిరసన తెలిపారు. అప్పర్ భద్ర ఆపారా ? విశాఖ రైల్వేజోన్ తెచ్చారా? అంటూ నిలదీశారు.
టీడీపీ సభ్యుల నిరసన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మొత్తం 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వరుసగా ఐదో రోజు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు.
సీఎం జగన్ ఢిల్లీ ఎందుకెళ్లారు? ఏం తెచ్చారో చెప్పమంటే సభ నుంచి తమను సస్పెండ్ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్‌కు ఢిల్లీ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ అని విమర్శించారు.
జగన్‌రెడ్డి సీఎం అయ్యాక 18 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఎందుకెళ్లారో ఎవరికీ తెలియదని విస్మయం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే సీఎం హుటాహుటిన ఢిల్లీకి ఎందుకెళ్లారో ప్రకటన చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తనను అరెస్ట్ చేయవద్దని ఉత్తరువు ఇవ్వమని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సమయంలోనే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లడం గమనార్హం. అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకోవడమే ఆయన పర్యటన అజెండాగా కధనాలు వెలువడ్డాయి.