జగన్: గత జల సేతుబంధనం ప్లానింగ్!

Wednesday, October 9, 2024

వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పదిలంగా కాపాడుకోవాలని అనుకుంటున్నారు. ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే చాలు తాను ఇక, కనీసం మూడు నాలుగు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి హోదాలో చెక్కుచెదరకుండా ఉంటానని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. తనకు తిరుగులేదు గనుక.. పార్టీ గురించి పట్టించుకోవాలనే ధ్యాస పరిపాలనలో ఉన్న రోజులలో ఆయనకు పుట్టలేదు. తాను అధికారంలో ఉండడం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కూడా గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుందని, గెలిచిన ఎమ్మెల్యేలు తన పార్టీ వారై ఉండాలని ఆయన అనుకున్నారో లేదో తెలియదు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలు విసిగి వేసారి పోయి ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి, సాధారణ ఎమ్మెల్యేగా సభలో కూర్చోబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పునర్నిర్మాణం గురించి ఆలోచించడం సహజం. అయితే కనీసం ఆ పని చేయడానికి అయినా ఆయన ప్లానింగ్ పద్ధతిగా ఉన్నదా లేదా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం!

ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే అనేకమంది నాయకులు ఇతర పార్టీలలోకి వలస వెళ్లిపోయారు. ఇంకా కొందరు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొందరు రాజకీయాలే మానుకున్నారు తప్ప.. వైసీపీకి మాత్రం రాజీనామా చేసేశారు.  రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలు వైసిపి చేజారి తెలుగుదేశం, జనసేన ఖాతాలోకి వెళ్లిపోయాయి. నిజానికి రాజకీయాలలో ప్రత్యక్షంగా ఉండే వారికి ఎవరెవరు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు ముందుగానే సమాచారం తెలియకుండా ఉండదు. ముందుగా సమాచారం కూడా తెలియనంత గుడ్డిదనంతో పార్టీ నడుపుతూ ఉంటే గనుక వాళ్లు నాయకులుగా పనికిరారు. దాని అర్థం ఏమిటంటే ఏ నాయకులు వెళ్ళిపోతున్నారో ముందుగానే పసిగట్టి ఆ దశలోనే వారిని బుజ్జగించి పార్టీ నుంచి వెళ్ళిపోకుండా కట్టడి చేయగలగడంలోనే నాయకుడు తెలివితేటలు, కార్య సమర్ధత బయటపడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నం కించిత్తు కూడా చేయలేదు. పార్టీ అంతర్గత సమావేశాలలో కొందరు నాయకులు వెళ్లిపోతున్న వారి గురించి ప్రస్తావించినప్పుడు ‘‘వెళ్లే వారిని వెళ్ళిపోనివ్వండి.. ఉండేవాళ్లే మనవాళ్లు. కొత్త నాయకులను తయారు చేసుకుందాం’’ అని జగన్ సినిమా డైలాగులు వల్లించినట్లుగా వార్తలు వచ్చాయి. 

బోలెడు మంది నాయకులు వెళ్లిపోయిన తర్వాత, వెళ్లడానికి ఇంకా పలువురు సిద్ధంగా ఉన్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ఇక ఎవ్వరు వెళ్ళకుండా తాను జిల్లాలలో పర్యటించి నాయకులందరితోనూ మాట్లాడతా అంటున్నారు. పార్టీ ఓడిపోయి నాలుగు నెలలు గడుస్తోంది. అంటే ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం జరగలేదు- అని ఆయనే ఒప్పుకుంటునట్లు లెక్క. బెటర్ లేట్ దాని నెవర్ అనే అనుకుందాం! ఆలస్యంగా అయినా మొదలెడుతున్నారు కదా పార్టీ గాడిలో పడుతుంది అని ఎవరైనా ఆశలు పెట్టుకుంటే భంగపడక తప్పదు. ఎందుకంటే జగన్ జిల్లాలలో పర్యటించి నాయకులతో భేటీ అయ్యేది ఇప్పుడు కాదు. అందుకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో గానీ, మార్చిలో గాని ఆయన జిల్లాల్లో పర్యటిస్తారట. తెలుగు భాషలో గత జల సేతు బంధనం అని ఒక సామెత ఉంటుంది. నదిలో నీటి ప్రవాహం ఉండగా వంతెన కడితే ఉపయోగం కానీ, నీళ్లు వెళ్లిపోయిన తర్వాత అసలు నది ఎండిపోయిన తర్వాత వంతెన కడితే ఎంత? కట్టకపోతే ఎంత? అని ఈ సామెత అర్థం! ఆ రకంగా రాబోయే ఆరు నెలల్లో పార్టీ నుంచి మరింత మంది కార్యకర్తలు వలసలు వెళ్లిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాలలో పర్యటిస్తే ఎంత? పర్యటించకపోతే ఎంత? అని పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles