2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో దాడి జరిగిందని ఆరోపిస్తూ, పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపిన కోడికత్తి కేసు మంగళవారం అర్ధాంతరంగా విశాఖపట్నంకు బదిలీ అయ్యింది. ఇప్పటి వరకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సాగిన విచారణలు ఇకపై విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతుందని మంగళవారం విజయవాడలో జరిగిన కోర్టు విచారణలో న్యాయమూర్తి వెల్లడించారు.
2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని అదే సమయంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ నడుస్తుంది. ఇప్పటికే కేసులో 80 శాతం విచారణ పూర్తయిందని, కేసులో ప్రత్యక్ష సాక్షి సీఎం జగన్ నేరుగా కోర్టులో హాజరై సాక్ష్యం చెబితేనే కేసు ముందుకు సాగుతుందని నిందితుడు తరపు న్యాయవాదులు వాదించారు.
లేని పక్షంలో కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందంటుని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుస్ సలీం పేర్కొన్నారు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నిర్ణయంతో కోడి కత్తి కేసు మరలా మొదటికి వచ్చిందని నిందితుడు తరపు న్యాయవాది అబ్దుస్ సలీం వాపోయారు. అయితే నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరుఫున వాదిస్తున్న న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కేసు విచారణలోకి వచ్చింది. దీంతో పాటు ఈ కేసుపై సీఎం జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
ఇదిలాఉండగా విజయవాడలో ఉన్న ఎన్‌ఐఏ కోర్టు విశాఖకు బదిలీ చేస్తున్నందున ఇకపై విశాఖలో కేసు విచారణ కొనసాగుతుందని జడ్జి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ ఆగస్టు 8న నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కేసు ప్రారంభమై ఇప్పటి వరకు ఇందులో కీలకమైన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టు ముందుకు వచ్చి జరిగిన ఘటన గురించి వివరించలేదు. కోర్టుకు హాజరు కాలేరని, కోర్టు నియమించిన అడ్వొకేట్ ముందు లేదా వీడియో కాన్ఫరెన్స్ లో సాక్షం రికార్డు చేసే ఏర్పాటు చేయాలని ఆయన తరపున న్యాయవాదులు కోరుతున్నారు.
అయితే, అందుకు నిందితుడి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శిక్ష స్మృతి ప్రకారం కోర్టుకు హాజరై, నిందితుడి సమక్షంలో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆ విధంగా చేయని పక్షంలో కేసు నిలబడదని స్పష్టం చేస్తున్నారు. మొదట్లో ఇందులో కుట్రకోణం గురించి దర్యాప్తు చేయాలని కేసు విచారణ జాప్యం చేసే ప్రయత్నం చేశారు.
అయితే, ఆ దిశలో దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ `కుట్ర కోణం’ అంటూ ఏమీ లేదని తేల్చి చెప్పింది. దానితో 2019 ఎన్నికల ముందు నాటి అధికార పక్షం టిడిపి కుట్రపూరితంగా తమపై దాడి చేయించిందని చేసిన ఆరొపణలు వాస్తవం కాదని తేలిపోయింది. ఇప్పుడు కూడా 2024 ఎన్నికల ముందు ఈ కేసును కొట్టివేస్తే రాజకీయంగా గతంలో తప్పుడు కధనాలు వ్యాప్తి చేశామని సంకేతం జనంలోకి వెడుతుందని, విచారణలో జాప్యం జరిగే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి.