భారత రాష్ట్ర సమితి పేరుతో తన జాతీయ పార్టీ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్.. ఏపీ విషయంలో ఎలాంటి ధోరణితో ఉండబోతున్నారనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. తెలంగాణ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా భారాసకు అస్తిత్వం ఏర్పడినదా అంటే.. అది కేవలం ఏపీలో మాత్రమే. ఏపీ ఒక్కచోటే భారాసకు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. తొందర్లోనే విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించబోతున్నారు. ఏపీలో మాత్రమే భారాస ఫ్లెక్సిలు కూడా దర్శనమిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుంది? అనే సందేహం అందరిలోనూ ఉంది. జగన్-కేసీఆర్ మధ్య ఉండే సాన్నిహిత్యం రాజకీయ అనుబంధంగా కూడా రహస్యంగా కొనసాగుతుందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి.
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే భారాస పనిచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా చూడాలని, జగన్ ప్రభుత్వ పతనాన్ని నిర్దేశించాలని ఒకవైపు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అంటూ ఉన్నారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం అనేది ఖరారు అయింది. భాజపా పెద్దప్రాధాన్యం లేని పార్టీ గనుక.. ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ, ఈ రెండు పార్టీల కలయిక జగన్ సర్కారుకు ప్రమాదకారి అయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో చంద్రబాబు కూటమితో కేసీఆర్ చేయి కలపడం అనేది అసాధ్యం. అలా.. భారాస ఏపీలో విడిగానే పోటీచేస్తుందని, జగన్ వ్యతిరేక ఓటును చీల్చి.. తెలుగుదేశం- జనసేన కూటమిని బలహీన పరచడానికే ప్రధానంగా పనిచేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
అయితే కేసీఆర్- జగన్ మధ్య అక్రమసంబంధం ఉన్నదో లేదో ఇప్పుడు తేలిపోతుందని కొందరు అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలు కలసికట్టుగా.. జీవో నెం.1కు వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో ఉన్నాయి. రాజకీయ ఐక్యపోరాటానికి సిద్ధమవుతున్నాయి. హైకోర్టులో పిటిషన్ వేసి.. జీవోను సస్పెండ్ చేయించిన సీపీఐ రామకృష్ణ తాజాగా చంద్రబాబును కలిసి ఐక్యపోరాటానికి మద్దతిచ్చారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలతో కూడా తాము సంప్రదింపులు జరిపి.. కలిసి పోరాడుతాం అని చెప్పారు. అయితే జీవోనెం.1కు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో భారాస భాగస్వామి అవుతుందా? లేదా? అనేది కీలకం. భారాస ఏపీలో సభలు పెట్టాలన్నా సరే.. ఈ జీవో వారికి అడ్డంకి అవుతుంది. ప్రతిచోటా భారీ బహిరంగ సభలు పెట్టేంత సీన్ భారాసకు లేదు. అసలే కవిత త్వరలోనే ఏపీలో పర్యటించాలని అనుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో కనీసం రోడ్ షోలు కూడా లేకుండా.. ఏదో కల్యాణ మండపాల్లో మీటింగులతో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు.. అనేది ప్రశ్న. ఈ నేపథ్యంలో జీవో నెం.1కు వ్యతిరేకంగా గళం వినిపిస్తారా లేదా? పోరాడుతారా లేదా? అనేదాన్ని బట్టి కేసీఆర్, జగన్ తో కుమ్మక్కు అయ్యారో లేదో తేలిపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్-కేసీఆర్ అక్రమబంధం.. ఈ అంశంలో తేలిపోదా?
Friday, November 15, 2024