జగన్ కు హైకోర్టులో వరుసగా షాక్ లు.. జిఓ నం 1 కొట్టివేత

Thursday, December 19, 2024

* ఎంపీ రఘురామకు సిఐడి కస్టోడియల్ టార్చర్ పై ఝలక్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఏపీ హైకోర్టులో వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లకుండా నిరోధించడంకోసం, నిరసనలను కట్టడిచేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 1ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

మరోవంక, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్‌ పై ఏపీ కూడా ప్రభుత్వానికి షాక్ తగిలింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్రపరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని సీబీఐ న్యాయవాది సూచించగా పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే,  అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జీవో నంబర్ వన్ ను సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై గత జనవరిలో వాదనలు జరిగాయి.

ఇదే అంశంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజే ధర్మాసనం జనవరి చివరి వారంలో విచారణ జరిపింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని, రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ ఆ జీవోను కొట్టి వేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో నంబర్ వన్ తీసుకొచ్చిందని విచారణలో భాగంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటికే సెక్షన్ 30 ప్రకారం పోలీసుల అనుమతి తీసుకొనే పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయని, ఈ ప్రక్రియ నిరంతరం సాగుతోందని చెప్పారు. అయితే, ప్రత్యేకంగా మరో జీవో తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను నియంత్రించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

2008లో ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశానికి సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ తరపు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆనాడు చిరంజీవి చేపట్టిన సమావేశంలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారని, దీంతో అప్పటి ప్రభుత్వం  పాదయాత్ర, బహిరంగ సమావేశాలు, ర్యాలీల కోసం విధి విధానాలు, నిబంధనలు రూపొందించిందని చెప్పారు.

ఆ నివేదికను ఉమ్మడి హైకోర్టులో సమర్పించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ నివేదికలో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నారని పేకరోన్తు అవి అమల్లో ఉండగా మళ్లీ కొత్త ఆంక్షలు విధిస్తూ జీవో తీసుకురావడం సరికాదని కాంగ్రెస్ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.

అయితే, పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ర్యాలీలు, సమావేశాలకు సంబంధించిన ఏ అంశంలోనూ నిషేధం విధించలేదని,  సెక్షన్ 30 లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నియంత్రణకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం తరపున ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీల ర్యాలీలు, సమావేశాలను రద్దు చేయలేదని స్పష్టం చేశారు.

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని జనవరి 23న రిజర్వ్ చేసింది. కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి, 11 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని సాకుగా తీసుకొని రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలో దుమారం రేపాయి. టీడీపీ నాయకులు లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఈ జిఓను కొట్టివేయడం పట్ల ఎంపీ రఘురామ కృష్ణంరాజు హర్షం ప్రకటిస్తూ పిచ్చి కుక్క కాటుకి ఆలస్యంగానైన చెప్పు దెబ్బ తగిలిందని చెప్పారు. ఇకనుంచైనా ప్రభుత్వం తింగరి వేషాలు మానెయ్యాలని హితవు చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎన్ని అరాచకాలు చేశారోనని అంటూ మరో సీఎం ఉంటే ఈపాటికే రాజీనామా చేసేవారని ఎద్దేవా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles