దేశంలోనే హిందుత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధునిగా చెప్పుకొనే మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి ఇప్పుడు దేశంలోని రాజకీయ నాయకులతోనే అతిగొప్ప `హిందూవు’ గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇస్తున్నారు.
జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు ఎన్నో జరిగినా ఒక్క కేసులో కూడా నిందితులపై చర్య తీసుకోలేదని, తిరుమలలో అన్యమతస్తుల ప్రాబల్యం కొనసాగుతుందని, హిందూ దేవాలయ ఆస్తులను వైసిపి నేతలు స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారని, చివరకు శ్రీశైలంలో కూడా అన్యమతస్తుల ప్రాబల్యం పెరుగుతుందని … ఇటువంటి ఎన్నో ఆరోపణలు ఏపీ బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలతో పాటు ఎందరో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో ఆలయాలపై దాడులు, మతమార్పిళ్లు లేవని, కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుందని జగన్ కు `క్లిన్ చిట్’ ఇచ్చేసారు. కానీ, అటువంటి ఆరోపణలన్నింటిని డా. స్వామి కొట్టిపారేస్తున్నారు. ఏపీలో హిందూమతంకు ప్రమాదం అంటూ ఉంటె చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నాయకుల ద్వారా అనేవిధంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో పోరాడే బదులు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేనలు దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. హిందూ దేవాలయ వ్యవహారాలలో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని హితవు చెప్పారు. వైఎస్ జగన్ ఎన్నడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
టిటిడిలో జరిగిన అనుచిత సంఘటనలపై వార్తలు వ్రాసినందుకు ఆంధ్రజ్యోతిపై స్వామి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా రెండు సార్లు తిరుపతి, మంగళగిరిలకు వచ్చిన స్వామికి జగన్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఘనమైన విందు కూడా ఏర్పాటు చేశారు.
బిజెపి అగ్రనాయకత్వం సహితం జగన్ ను అవసరాలకోసం ఉపయోగించుకొని, ఆయన అవసరాలు తీర్చడం మినహా జగన్ కు ఇంతగా వెనుకవేసుకు రాలేదు. జగన్ పై అంతగా ప్రేమ ఏర్పడేందుకు కారణం ఏమిటో ఆయనే బయటపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యత్వం లేకపోవడంతో అసహనంగా ఉన్న ఆయన ఎవ్వరు తనను మరోసారి పార్లమెంట్ కు పంపిస్తారా అంటూ అన్వేషిస్తున్నారు.
బిజెపి దాదాపు ఆయనను పక్కన పడేసింది. అసలు పట్టించుకోవడం లేదు. ఆయన కూడా మోదీ ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా నిప్పులు చెరుగుతున్నారు. ఇదేవిధంగా మమతా బెనర్జీ తదితరులపై ప్రశంసలు కురిపించారు. వారేమైనా తనను పార్లమెంట్ కు పంపుతారేమోనని చూసారు. కానీ పంపలేదు. ఇప్పుడు జగన్ అన్నా పంపుతారేమో అని ఎదురు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయాలనుకుంటన్నట్లు మనసులో మాట చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నానన చెప్పడం ద్వారా పరోక్షంగా రాజ్యసభ సీట్ ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఏపీలో ఉన్న సంబంధాలను సహితం చెప్పుకోవడం గమనార్హం.
తాను మధురై నుంచి వచ్చినా తన అల్లుడు విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కుమారుడని చెప్పారు. తనకు తెలుగు రాదని, తన తల్లి మాట్లాడతారని, తన ముత్తాతలు టీటీడీ ఆలయాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా పని చేశారని అంటూ అలా తనకూ టీటీడీతో సంబంధం ఉందని తెలిపారు. రాజ్యసభ సీట్ కోసం ఎంతటికైనా దిగజారేందుకు స్వామి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
అయితే స్వామి పేరు చెబితేనే మోదీ, అమిత్ షా మండిపడుతున్నారు. వారి కోపాగ్నిని లెక్కచేయకుండా జగన్ ఈయనకు రాజ్యసభ సీట్ ఇస్తారనుకొంటే అపోహా మాత్రమే కాగలదు. చివరకు స్వామి ఒక వంక హిందూ నేతలలో అపఖ్యాతిపాలు కావడం, మరోవంక రాజ్యసభ సీట్ కూడా దక్కకపోవడం జరిగే అవకాశం ఉంది.